కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది

సంక్రాంతి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ’అనగనగా ఒక రాజు’. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరై నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పంపిణీదారులకు జ్ఞాపికలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “అనగనగా ఒక రాజు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. ఈ సినిమాలో నవీన్ వన్ మ్యాన్ షో చేశాడు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఈ అనగనగా ఒక రాజు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, సూర్యదేవర నాగవంశీ, మారి, చిన్మయి, చంద్రబోస్, యువరాజు, గాంధీ, వంశీ, చంద్ర, భద్రం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
