వికసిత భారతానికి 'కర్తవ్య'పథం

న్యూఢిల్లీ : ప్రపంచ డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, వ్యవసాయం, పర్యాటక రంగాలకు ప్రోత్సాహంతో పాటు., తయారీ రంగానికి పెద్దపీట వేస్తూ, దేశ అభివృద్ధిని సుస్థిరంగా ముందుకు నడిపే 2026-27 కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒడుదుడుకులు నేపథ్యంలో నిలకడగా వృద్ధిని కొనసాగించే దీర్ఘకాలిక బ్లూ ప్రింట్ గా నిర్మల రూ. 53.5 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రకటించారు. లోక్ సభలో రికార్డు స్థాయిలో 9వ సారి వరుసగా బడ్జెట్ ను సమర్పించిన నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మూలధన వ్యయాన్ని12.2 లక్షల కోట్లకు పెంచారు. గత సంవత్సరం ఇది రూ.11.2 లక్షల కోట్లుగా ఉంది. బడ్జెట్‌లో ఆర్థికమంత్రి పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి, ప్రజాదరణ పొందిన పథకాలను విస్మరించడం, పారిశ్రామిక వేత్తలకు నిరాశ కల్గించడంతో బడ్జెట్ స్టాక్ మార్కెట్ ను కుదిపివేసింది. ఒక్క సారిగా పలు స్టాక్స్ కుప్పకూలడం సంచలనంగా మారింది. డెరివేటివ్స్ ట్రేడింగ్ పై అధిక లావాదేవీ పన్ను సెంటిమెంట్ పై ప్రభావం చూపింది.
ప్రధానంగా సామాన్య ప్రజలకు ఊరటకలిగించిన విషయాలలో 17 కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం మినహాయించడం, బ్యాగేజీ నియమ నిబంధనలను సడలించడం, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 10 శాతం తగ్గించడం ద్వారా కస్టమ్స్ విధానాన్ని సరళీకృతం చేయడం వంటివి ఉన్నాయి. ఔషధాలు, సెమీ కండక్టర్లు, అరుదైన - భూ ఖనిజాలు, రసాయనాలు, మూలధన వస్తువులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు వంటి ఏడు రంగాలలో ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. ఉద్యోగ కల్పన, సాంకేతికతతో కూడిన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పశుసంవర్థక, మత్స్య సంపద, అధికవిలువ గల వ్యవసాయ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించనున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని బయో ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించినట్లు నిర్మల ప్రకటించారు. వస్త పరిశ్రమకు పెద్దపీట వేయనున్నారు. ఎగుమతుల ప్రోత్సాహం కోసం సమగ్ర కార్యక్రమాన్ని ప్రకటించిన ఆర్థికమంత్రి.
పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం
పర్యావరణ హితమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పర్యావరణ పరంగా స్థిరమైన పర్వత మార్గాల అభివృద్ధితో పాటు, భారతీయ ప్రాచీన సంసృ్కతికి అద్దంపట్టే 15 పురావస్తు ప్రదేశాల అభివృద్ధిని ప్రతిపాదించారు. చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు, ప్రమాణాలతో కూడిన సంస్థల ప్రోత్సాహానికి రూ. 10,000 కోట్లతో ఎస్‌ఎంఇ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్నువ్యవస్థలో భారీ మార్పులు, పలు ఉత్పత్తులపై జిఎస్టీ తగ్గింపు కొనసాగించడం వల్ల ప్రజలకు పెద్ద ఊరట లభించింది.అవి, మౌలిక సదుపాయాలపై ఖర్చు, కార్మక చట్టాల సవరణ, ఆర్ బిఐ వడ్డీ రేటు తగ్గింపులతో మరింత సౌకర్యంగా ఉంది. ఈ కారణంగానే భారత ఆర్థికవ్యవస్థ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించింన శిక్షాత్మక 50 శాతం సుంకాన్ని తట్టుకునేందుకు సహాయ పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ క్లిష్టమైన నేపథ్యంలో వచ్చింది.
దేశంలో డిమాండ్ నిలకడగా ఉండి, 'ద్రవ్యోల్బణం కాస్త తగ్గినప్పటికీ, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిర వస్తువుల ధరలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల అసమాన ద్రవ్య సడలింపులతో ప్రపంచ అనిశ్చితుల మధ్య ఈ బడ్జెట్ రూపకల్పన చేయాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వం స్వదేశంలో వినియోగాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనను వేగవంతం చేసేందుకు, మూలధన వ్యయాన్ని పెంచడానికి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఆదే సమయంలో ఆర్థికలోటు తక్కువగా ఉంచేందుకు కృషి చేస్తున్నది. అత్యంత క్లిష్ట పరిస్థితులలోనూ భారతదేశం వికసిత భారత్ వైపు వడివడిగా అడుగులు వేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విస్తరిస్తున్న వాణిజ్యం, మూలధనం అవసరాలతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రపంచమార్కెట్లతో అనుసందానం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణం- జిడిపి నిష్పత్తిని 56.1 శాతం నుంచి 55.6 శాతానికి తగ్గించడం, ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో ఆర్థికలోటును 4.4 శాతం నుంచి 4.3 శా తానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
10వేల కోట్లతో బయో ఫార్మా తయారీ కేంద్రం
రూ. 10,000 కోట్ల వ్యయంతో బయో ఫార్మా తయారీ కేంద్రం, సెమీ కండక్టర్ మిషన్ రెండో దశ, ఎలక్ట్రానిక్ భాగాల తయారీకి రూ. 40,000 కోట్ల వ్యయం, ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో అరుదైన భూమి కారిడార్ లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఆర్థికమంత్రి ప్రకటించారు.
-
Home
-
Menu
