ప్రభుత్వ భూముల వేలంపై విపక్షాల పోరు.. హెచ్ఎండిఎ కార్యాలయం ముట్టడి

ప్రభుత్వ భూముల వేలంపై విపక్షాల పోరు.. హెచ్ఎండిఎ కార్యాలయం ముట్టడి
X

మన తెలంగాణ – హైదరాబాద్ సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వేలం అంశం రాజకీయంగా వేడెక్కింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్‌లోని విలువైన భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఈ నెల 27న హెచ్‌ఎండీఏ నిర్వహించనున్న ఈ-వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.

ప్రజా ప్రయోజనాల భూములు అమ్మొద్దు....

ప్రజా అవసరాల కోసం గతంలో సేకరించిన మూసాపేట ట్రక్ పార్క్, కేపీహెచ్‌బీ, మియాపూర్ ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు విక్రయించవద్దని విపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలని, వేలం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఆందోళనలో హరీశ్ రావు, ఎమ్మెల్యేలు....

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు నిరసనలో పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయం వద్దకు వేల సంఖ్యలో హుడా ట్రక్ పార్క్ బాధితులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా హెచ్‌ఎండీఏ కార్యాలయానికి తరలివచ్చారు.

హెచ్ఎండిఎ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

విపక్ష పార్టీల ముట్టడి నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం వైపు వస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 27న జరగనున్న భూముల ఈ-వేలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను విక్రయిస్తే స్థానిక ప్రజలు, కాలనీల అవసరాలకు నష్టం కలుగుతుందని విపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

Tags

Next Story