కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులు

Parents tried to kidnap their daughter
X

Parents tried to kidnap their daughter

తాము వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో కులాంతర వివాహాం చేసుకున్న కుమార్తెను అత్తవారింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కన్న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా. ఎండపల్లి మండలం, రాజారాంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, పాలకురి మండలం, బసంత్‌నగర్‌కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేశ్ గత ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ బిడ్డను ప్రేమించిన రాకేశ్ దళితుడు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు ఆ పెళ్లికి అడ్డు చెప్పారు. అయితే రాకేశ్‌నే పెళ్లి చేసుకుని అతడితోనే జీవిస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియాంక జూలై 27న అతనిని కులాంతర వివాహం చేసుకుంది. తాము వద్దన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు వారిద్దరినీ విడదీసేందుకు అప్పటి నుంచి విఫల ప్రయత్నాలు చేశారు.రాకేశ్‌తోనే తన జీవితమంటూ ప్రియాంక అతడి వైపు గట్టిగా నిలబడటంతో ఏమీ చేయలేకపోయారు.

ప్రియాంక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి బిడ్డతో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించింది. వైద్య పరీక్షల కోసం తన అత్తతో కలిసి బుధవారం జగిత్యాలలోని ఆస్పత్రికి వస్తున్నట్లు తెలుసుకున్న ప్రియాంక తల్లి జగిత్యాల ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి రాజక్కపల్లి వెళ్లేందుకు వెల్గటూర్ బస్సు కోసం బస్టాండ్‌కు చేరుకోగా అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో ధర్మారం వెళ్లే బస్సు ఎక్కి రాజారాంపల్లిలో వారు దిగారు. అయితే జగిత్యాల ఆస్పత్రిలో ఉన్నప్పుడే ప్రియాంక తల్లి తన భర్తకు ఫోన్ చేసి బిడ్డను బలవంతంగా తీసుకెళ్లేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. ఫోన్‌లో మాట్లాడి ఎప్పటికప్పుడు భర్తకు సమాచారం అందించింది.రాజారాంపల్లిలో దిగగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన బిడ్డ వెంట ఉన్న అత్తను మూత్ర విసర్జనకు వెళదామని చెప్పి వెంట తీసుకెళ్లగా, అప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేశ్, అన అక్క భర్త గుంజ కుమార్ కారులో రాజారాంపల్లికి వేచిచూస్తున్నారు.

ప్రియాంక రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన వారు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. తనను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రియాంక కేకలు వేస్తూ స్థానికుల సహాయంతో వారి బారి నుంచి తప్పించుకుంది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని, చంపుతానని బెదిరించారంటూ వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన భర్త రాకేశ్‌కు తండ్రితో పాటు బావతో ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన అమ్మే తనను నమ్మించి మోసం చేసిందని కన్నీళ్ల పర్యంతమైంది.

Tags

Next Story