తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: ఎంఎల్‌ఎ అనిరుధ్‌రెడ్డి

తెలంగాణ ప్రజలవి దిష్టికళ్లు అంటూ వ్యాఖ్యానించిన ఎపి డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు ఏపీపై ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్లిపోవాలని, అలా చేయకుండా కొత్తగా ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని నిలదీశారు. తెలంగాణ ప్రజల దిష్టి కళ్లు తలగడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు. సామాన్యుడైన తాను పదేళ్లకే సీఎం అభ్యర్థి అవుతానని అంటుంటే పవన్ 15 ఏళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని, 70 ఏళ్ల వయసులో ఆయన సీఎం అయి చేసేదేముందని ఎద్దేవా చేశారు. తాము కూడా మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి సినీ హిరోలు అందరినీ అభిమానిస్తామని చెప్పారు.
2019లో ఆంధ్రలో జరిగిన ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన చిత్తుగా ఓడిపోతే, కనీసం పవన్ ఒక్కరైనా గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్లిఉండేవారని తాను కూడా బాధపడ్డానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని గెలిచి, పదవి తెచ్చుకున్నారని, పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేదని పేర్కొన్నారు. ఆంధ్రలో జగన్ గెలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్లందరూ హైదరాబాద్‌కు వచ్చి తలదాచుకుంటారని, టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్లు హైదరాబాద్‌లో తలదాచుకుంటారని, తలదాచుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి హైదరాబాద్ తెలంగాణ కావాలి గానీ, తెలంగాణ ప్రజలది నరదిష్టి అని నిందిస్తారా? అని నిలదీశారు. ‘మీరు క్షమాపణ చెప్పాల్సిందే.. లేకపోతే హైదరాబాద్‌లో ఎందుకు ఆస్తులు కొంటున్నారు, అప్పులన్నీ తీరిపోయినాయంట కదా, అని ప్రజలందరూ అంటున్నారు..’ అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, సినిమా టిక్కెట్ ధరలు పెంచాలంటే అందులో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికులు అందరికీ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అంటూ అందుకు హ్యాట్సాప్ అని పేర్కొన్నారు.
-
Home
-
Menu
