రేపు కొండగట్టుకు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు క్షేత్రంలో 100 గదులతో కూడిన ధర్మశాల, మాల విరమణ మండప పనులకు టిటిడి నుంచి రూ.35.19 కోట్లు మంజూరు చేయించిన పవన్‌కళ్యాణ్, ఆ పనులకు భూమి పూజ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు సమీపంలోని జెఎన్‌టియు కళాశాలకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకుని ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఘాట్ రోడ్డులో నిర్మించనున్న 100 గదులతో కూడిన ధర్మశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్‌లో జనసేన నాయకులు, అభిమానులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తిరిగి జెఎన్‌టియుకు చేరుకుని హెలికాప్టర్‌లో హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల వరకు కొండగట్టుకు చేరుకుని మధ్యాహ్నం రెండు గంటల వరకు కొండగట్టులోనే గడపనుండగా ఇటు దేవాదాయ శాఖ అధికారులు, అటు రెవెన్యూ, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొండగట్టు అంజన్న అంటే పవన్‌కు అత్యంత భక్తి
ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు అంజన్న అంటే అత్యంత భక్తి, అపార నమ్మకం. గతంలో అంజన్న దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఆయన కరెంట్ షాక్‌కు గురైనా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదంలోనూ తాను అంజన్న దయ వల్లే బతికి బయటపడ్డానని, కొండగట్టు అంజన్న మహాత్యం గొప్పదంటూ ఆయన సందర్బం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. ఆ తర్వాత తాను జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా కొండగట్టుకు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార రథం వారాహికి కూడా కొండగట్టులోనే ఆయన పూజ చేయించారు. అదే సమయంలో కొండగట్టులో ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అధికారులు, అర్చకుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన వంతుగా కొండగట్టుకు ఏదో ఒకటి చేస్తానని మాట ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు తనకు డిప్యూటీ సిఎం పదవి దక్కడంతో ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగా కొండగట్టులో 100 గదులతో కూడిన ధర్మశాల, ఒకేసారి రెండు వేల మంది మాల విరమణ చేసుకునేలా మండపం నిర్మాణం కోసం టిటిడి నుంచి రూ.35.19 కోట్లు మంజూరు చేయించి కొండగట్టు అంజన్నపై తనకున్న భక్తి, నమ్మకాన్ని చాటుకున్నారు.
-
Home
-
Menu
