కొండగట్టు పునర్జన్మనిచ్చింది: పవన్ కళ్యాణ్

కొండగట్టు పునర్జన్మనిచ్చింది: పవన్ కళ్యాణ్
X

‘మా అమ్మ నాకు జన్మనిస్తే..కొండగట్టు అంజన్న పునర్జన్మనిచ్చాడు. కొండగట్టుకు వచ్చిన నేను ప్రచార రథంపై ఉండగా నాకు హైటెన్షన్ వైరు తగిలినా ప్రాణాలతో బయటపడ్డాను. నేను ప్రాణాలతో ఎలా బయటపడ్డానో ఈరోజు వరకు కూడా తెలియదు. పునర్జన్మనిచ్చిన అంజనేయస్వామి అంటే నాకు అపారమైన భక్తి’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు కొణిదెల పవన్‌కళ్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా, కొండగట్టు పుణ్యక్షేత్రంలో 96 గదులతో కూడిన ధర్మశాల, అంజనేయ స్వామి దీక్షాపరులు మాల విరమణ చేసేందుకు మండప నిర్మాణం కోసం టిటిడి నుంచి రూ. 35.19 కోట్లు మంజూరు చేయించిన ఆయన శనివారం కొండగట్టుకు చేరుకుని అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. హైదారాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడి జెఎన్‌టియు కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌కు పోలీసులు గౌరవ వందనం చేయగా, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎంఎల్‌ఎ మేడిపల్లి సత్యం, టిటిడి బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడుతో కలిసి ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మశాల, మండప నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ..తెలంగాణలో ఎన్నో పోరాటాలు చేసి నేడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అన్నివిధాలా అభివృద్ధ్ది చెందుతుందని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్శిటీలో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడిగా పని చేసినప్పటి నుంచి తనకు తెలుసునని అన్నారు. అప్పట్లో తమకు ఒక గ్రూపు ఉండేదని, గ్రూపు సభ్యులమంతా తరచూ కలుసుకునే వాళ్లమని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత ఉన్న మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన నియోజకవర్గ పరిధిలోనే తన ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న ఆలయం ఉండటం సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో కొండగట్టుకు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని వసతి సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వసతులు కల్పించాలని అర్చకులు కోరినట్లు తెలిపారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతోనే ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, స్వామి వారి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో కొండగట్టులో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని టిటిడి బోర్డును కోరానని అన్నారు. వారి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేయడంతో నేడు ఇక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.

ఇది స్వామి వారి ఆజ్ఞ అని, బలమైన సంకల్పంతో ప్రతిపాదనను టిటిడి బోర్డు ముందు ఉంచితే వారు అంగీకరించినందుకు టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సహకరించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తనను కోరారని, అయితే రామ కార్యానికి అడ్డేమీ ఉండదని, గిరి ప్రదక్షిణకు తన వంతు సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇది రామసేవ, భజరంగబలి సేవ, గిరి ప్రదర్శన శక్తి తెలంగాణ రక్షణకు, దేశ రక్షణకు ఉపయోగపడే గిరి ప్రదక్షిణ అవుతుందని అన్నారు. గిరి ప్రదక్షిణ పనులు ప్రారంభిస్తే తామంతా వచ్చి కరసేవ చేస్తామని అన్నారు. ఇక్కడ మాల విరమణ చేసి భక్తులు నేరుగా తిరుమల వెళ్లడం ఆనవాయితీ అని, వారి కోసం 96 గదుల సత్రాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో ఆంజనేయస్వామి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై, దేశ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదని, ఆయన యూనివర్శల్ క్యాడర్ అని అన్నారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Tags

Next Story