ఎవరి అండ చూసుకుని గూండా వెంకటేష్ దాడులు చేస్తున్నాడు: ఈటెల

ఎవరి అండ చూసుకుని గూండా వెంకటేష్ దాడులు చేస్తున్నాడు: ఈటెల
X

మేడ్చల్ మల్కాజ్ గిరి: ఏకశిల రియల్ ఎస్టేట్ గూండా వెంకటేష్ భరతం పడతామని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఈ ప్రాంత ఎంపిగా ఉన్న తానే స్వయంగా హెచ్చరించినా గూండాలు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. ఏకశిలా నగర్ లో ఈటెల పర్యటించి ప్లాట్లా యజమానులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. రియల్టర్‌ వెంకటేష్ ఎవరి అండ చూసుకుని ప్లాట్స్ యజమానులపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు 24 గంటల్లో నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. లేకపోతే ప్లాట్ల యజమానులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, భూ మాఫియా గుండాల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయని మండిపడ్డారు.

సిఎం రేవంత్ రెడ్డి పాలనలో భూ మాఫియా రౌడీలు బహిరంగంగా ప్రజల ప్రాణాలు తీయడానికి కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని, భూ మాఫియాకు రేవంత్ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల పనితీరుకు, చేతకానితనానికి పరాకాష్ట ఏకశిలా నగర్ లో జరిగిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఒక ఎంపి ఏకశిలా నగర్ లో జరుగుతున్న గుండాల అరాచకాలను బయటపెట్టినా.. అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించిన తర్వాత కూడా స్పందించకపోవడం దురదృష్టకరమైన విషయమన్నారు. ఈ ఘటనను ఊరికే వదిలిపెట్టమని, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా మా కార్యచరణ ఉంటుందని, బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుందని, మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటెల హెచ్చరించారు.


ఏకశిలా వెంచర్‌లో ప్లాట్ల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎడి సర్వే కోసం వచ్చిన అధికారులను ఏకశిలా ప్లాట్ ఓవర్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో హర్ష కన్‌స్ట్రక్షన్ యజమాని వెంకటేశ్ అనుచరులు, ప్లాట్లా యజమానుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించడానికి ప్రయత్నించారు. పోలీసుల ఎదుటే వెంకటేశ్ అనుచరులు రాడ్లు తీసుకొని ప్లాట్ల యజమానులు తలలు పగులగొట్టారు. నలుగురు యువకులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్లాట్ల యజమానులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags

Next Story