మనది చెక్కుచెదరని బంధం

మనది చెక్కుచెదరని బంధం
X

ఢిల్లీ: నేపాల్‌కు రూ.24,000 కోట్ల నేపాలీ రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో సోమవారం విసృ్తత చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేపాల్‌లో భారత్ సహకారంతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఇరుదేశాల ప్రధానులు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, నేపాల్‌లోని జనకపుర్ ధామ్ మధ్య సరిహద్దు ప్రయాణికుల రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. భారత్-నేపాల్ సంబంధాల బలాన్ని మోడీ ప్రస్తావిస్తూ, పొరుగు దేశ అభివృద్ధి, సౌభాగ్యానికి సాధ్యమైనంత సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. భారత్, నేపాల్ సంబంధాలు కేవలం పొరుగు దేశాల మధ్య సంబంధాలు మాత్రమే కావు. అవి బంధుత్వం,చెక్కుచెదరని విశ్వాసంతో కూడుకున్నవి. ఇరుదేశాల అభివృద్ధిలో మేం పరస్పరం భాగస్వాములం. కష్టకాలంలో ఒకరికొకరం అండగా నిలుస్తాం అని చెప్పారు. ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు

కోల్పోయిన వారికి ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేపాల్ పునర్నిర్మాణానికి, దీర్ఘకాలిక అభివృద్ధికి కొత్త బలాన్ని అందించేందుకు రూ.24,000 కోట్ల నేపాలీ రూపాయల అభివృద్ధి సహకార ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు.ఇంధన రంగంలో నేపాల్‌కు భారత్ అందిస్తున్న సహాయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. భారత్ ఎన్నో సంవత్సరాలుగా నేపాల్‌కు పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులను విశ్వసనీయంగా సరఫరా చేస్తోంది. పొరుగు దేశాలకు ప్రాధాన్య విధానం స్ఫూర్తికి అనుగుణంగా.. ఈ ఏడాది చమురు సరఫరాకు సంబంధించి తీవ్ర సవాళ్లు ఉన్నప్పటికీ, నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించాం అని తెలిపారు.ఆరోగ్యం, విద్య సహా నిర్దిష్ట రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కాగా, శతాబ్దాలుగా కొనసాగుతున్న నేపాల్-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసి, ఆధునికీకరించడమే మోడీతో తన చర్చల లక్ష్యమని బాలేంద్ర షా అన్నారు.


హిమాలయాలంత దృఢం: షా

భారత్, నేపాల్ సంబంధాలు హిమాలయాలంత దృఢమైనవని, సముద్రాలంత విస్తారమైనవని నేపాల్ ప్రధాని అన్నారు. విశ్వసనీయమైన, నమ్మకమైన పొరుగు దేశంగా భారత్.. నేపాల్‌లో ప్రకృతి విపత్తులు, కష్టకాలం వచ్చినప్పుడల్లా ముందుగా స్పందించింది. పరస్పర గౌరవం, స్థిరమైన విశ్వాసం, చెక్కుచెదరని స్నేహభావమే మా సంబంధాలకు పునాది అని ఆయన చెప్పారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలు నేపాల్-భారత్ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు.భారత్-నేపాల్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాద పరిష్కారానికి చైనా, యూకే జోక్యం అవసరమని మేలో షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బాలేంద్ర షా భారత్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలకు తిరిగి ఊపునిచ్చే ప్రయత్నంగా భావిస్తున్నారు.

Tags

Next Story