డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌లో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. డిసెంబర్ 14,15 తేదీల్లో ఫ్లోరిడాలోని మియామీలో జీ-20 నేతల సదస్సును అమెరికా నిర్వహించనుండటంతో సదస్సులో ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది జీ-20 అధ్యక్ష బాధ్యతలను అమెరికా నిర్వహిస్తోంది.
సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌తో మోడీ చర్చలు జరిపే అవకాశం ఉందని, అలాగే క్వాడ్ దేశాల సమావేశంలో కూడా పాల్గొంటారని సమాచారం. కాగా, అమెరికా పర్యటన అనంతరం మోడీ కెనడా వెళ్లి ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా, కెనడాలతో కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది.
రష్యా చమురు కొనుగోలు దేశాలపై అమెరికా గరిష్టంగా 100 శాతం సుంకాలు విధించే అవకాశాలున్న నేపథ్యంలో ఆదేశంతో భారత్ వాణిజ్య చర్చలు నెమ్మదించాయని, కెనడాతో చర్చలు మాత్రం సానుకూలంగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి చర్చలు పూర్తయ్యే అవకాశం ఉందని కెనడా వాణిజ్య మంత్రి మానిందర్ సిద్ధూ గతవారంలో ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో మోడీకి అతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్టు కార్నీ ఒక ప్రకటనలో తెలిపారు.
-
Home
-
Menu
