280 కిలో మీటర్లు. ఛేజ్‌.. కిడ్నాపర్‌ అరెస్ట్‌.... చిన్నారి సురక్షితం

280 కిలో మీటర్లు. ఛేజ్‌.. కిడ్నాపర్‌ అరెస్ట్‌.... చిన్నారి సురక్షితం
X

9 గంటల ఆపరేషన్‌.. నాగ్‌పూర్‌లో ఏడాది చిన్నారి సురక్షితం

రాయ్‌పూర్‌: ఏడాది చిన్నారి కిడ్నాప్‌ కేసులో రాయ్‌పూర్‌ పోలీసులు వేగంగా స్పందించి.. సుమారు 280 కిలోమీటర్లు వెంబడించి నిందితుడిని నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు. తొమ్మిది గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. సెప్టెంబర్‌ 22న మధ్యాహ్నం గుధియారీ ప్రాంతంలో పవన్‌ సాహూ అనే వ్యక్తి చిన్నారి ఇంట్లోకి చొరబడి.. తల్లితో గొడవ అనంతరం బిడ్డను లాక్కొని బైక్‌పై పారిపోయాడు. సాయంత్రం 4.15 గంటలకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడి కదలికలను పోలీసులు గుర్తించారు. కుంహారి టోల్‌ ప్లాజా వద్ద హైవే కెమెరాల్లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై అతడు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే నాగ్‌పూర్‌ పోలీసులను అప్రమత్తం చేసి.. మార్గమధ్యంలో నాకాబందీ ఏర్పాటు చేశారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో నాగ్‌పూర్‌లోని ఉమ్రేడ్‌ ప్రాంతంలో పవన్‌ సాహూను పోలీసులు పట్టుకున్నారు. చిన్నారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ నిందితుడు బాధిత మహిళతో నాగ్‌పూర్‌ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి పోలీసులు పట్టుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Next Story