నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ పాలన వరకు..వేల ఫోన్లు పోలీసులు వింటూనే ఉన్నారు: కెటిఆర్

నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ పాలన వరకు..వేల ఫోన్లు పోలీసులు వింటూనే ఉన్నారు: కెటిఆర్
X

దేశానికి ప్రధానిగా నెహ్రూ ఉన్నకాలం నుంచి నేటి ప్రధాని మోడీ పాలన వరకు దేశభద్రత, శాంతి భద్రతలు, ప్రభుత్వాల రక్షణకు పోలీసులు వేల సంఖ్యలో ఇతరుల ఫోన్లు వింటారని, ఇది పోలీసులకు నిత్యకృత్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం సిట్ ముందు హజరు కావాలని గురువారం కెటిఆర్‌కు నోటిసులు ఇచ్చిన అంశంపై కెటిఆర్ స్పందించారు. శుక్రవారం తప్పకుండా సిట్ ముందు హజరవుతానన్నారు. తనను ఎందుకు పిలిచారో తెలియదన్నారు. సిఎం రేవంత్‌రెడ్డికి దావోస్‌లో ఉన్నా ఇక్కడ డిప్యూటి సిఎం తన సీటును కాజేస్తారని, నల్లగొండ బాంబులతో మంత్రులు తన సీటుకు ఎసరు పెడతారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రోజుకొకరికి నోటీసులిచ్చి కాలక్షేపం చేస్తున్నారన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేదే సిట్ అన్నారు. కార్తీక దీపం సీరియల్‌గా ఇదెంత కాలం సాగుతుందో తెలియదన్నారు.

ఇప్పటికే రెండేళ్లలో రేవంత్ రెడ్డి హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేయాలని కోరడంతో బుధవారం హరీష్‌రావుకు, గురువారం తనకు సిట్ నోటీసులిచ్చారన్నారు. రెండేళ్లుగా కాళేశ్వరమని, గొర్రెల స్కామని, ఫోన్ ట్యాపింగని ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారన్నారు. హరీష్‌రావు సింగరేణి బొగ్గు కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్, బిజేపి నాయకులు కుమ్ముక్కై వందల కోట్లు కాజేశారని, అర్హత లేకున్నా సిఎం బావమరిది సృజన్‌రెడ్డికి అమృత్ పథకం కాంట్రాక్ట్ ఇచ్చారని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు భూ ఆక్రమణలపై ఆధారాలతో బయట పెట్టినందుకే సిట్ నోటీసులిచ్చారన్నారు. తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తేనే సిబిఐ విచారణ చేస్తామనడం చూస్తే దొంగ తనపై విచారణ కోరాలననట్టు ఉందన్నారు. కంచె గచ్చిబౌళిలో 10 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని సాక్షాత్తూ సెంట్రల్ ఎంపవర్‌మెంట్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎందుకు విచారించడం లేదన్నారు. ప్రధాని మోడీ స్వయంగా రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ (రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ) వసూలవుతుందన్నారని, మరి ఎందుకు విచారించడం లేదన్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటిఎంలా మారిందన్నారని.. దానిపై ఎందుకు విచారించడంలేదన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకటరెడ్డిలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బహిరంగంగా ప్రకటిస్తే.. దానిపై ఎందుకు విచారించడం లేదన్నారు. ఓ సన్నాసి ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి కుట్ర చేస్తున్నాడని, 50 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుని ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తున్నాడని తెలిస్తే, ఏ వెధవో ప్రభుత్వాన్ని కూలగొడతానంటే పోలీసులు ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చని, గూఢచర్యం అనేది నిరంతర ప్రక్రియని అంటూ, దానికీ రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉందన్నారు. అవసరమైతే ఆనాడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఇప్పటి డిజిపి శివధర్‌రెడ్డిని సిట్ పిలవాలని, లేదంటే అప్పటి డిజిపిలు మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రవిగుప్తాలను పిలిచి అడగాలని, తమనెందుకు పిలుస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అధికారంలోఉన్నవారికి ప్రధానంగా సిఎంలకు సమాచారం పోలీసులు గూఢచర్యం చేసి అందిస్తారని, అదేలా వచ్చిందో ఎవరికి చెప్పరన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా ఉన్న తమ ఫోన్లు ట్యాప్ చేయడం లేదని అధికారులు ప్రమాణ పూర్వకంగా చెప్పగలరా? అని కెటిఆర్ నిలదీశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసనేది లొట్టపీసుకేసు, బక్వాస్ కేసు, ట్రాష్ కేసని, అడిగిందే పలుసార్లు అడుగుతారని మళ్లీ అదే చెపుతామని, ఇది పూర్తిగా రాజకీయ వేధింపుల కుట్ర అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులను బలి పశువులను చేసే చర్య అన్నారు. త్వరలో తమ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సిఎం కాగానే తాము కూడా కాంగ్రెస్ నేతల అక్రమాలపై విచారణ చేపట్టక తప్పదన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఫోన్‌ల ట్యాపింగ్ జరగడంలేదా? అన్నారు. తమకు నోటీసులిస్తే రేవంత్‌రెడ్డి దావోస్‌లో రెండుగంటలపాటు శునకానందం పొందుతాడేమో కాని తమకేమీ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని రకాలుగా వేధించాలని చూసినా తాము మాత్రం ప్రజల పక్షాన ఉంటామని, కాంగ్రెస్ బిజేపిల సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని వదలమని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలయ్యేంత వరకూ ఊరుకోమని కెటిఆర్ హెచ్చరించారు.

Tags

Next Story