ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఓట్లు అడిగే ప్రసక్తే లేదు: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తమకు ఓట్లు వేయాలని అడిగే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ నగరంలో శనివారం పర్యటించిన మంత్రి పాముల బస్తీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు.
చివరి దశలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. అనంతరం ఐడీఓసీని ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్లను పరిశీలించారు.పెండింగ్ పనులను తక్షణమే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. పనులు పూర్తయిన 24 గంటల్లో బిల్లులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతలో రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లను కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్లను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం 400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్లను పంపిణీ చేస్తున్నామని, మరో 300 మందికి వారం, పది రోజుల్లో అందజేస్తామని చెప్పారు.పట్టణాలు, నగరాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నిజామాబాద్లోని నాగారం నిర్మిత కేంద్రం వద్ద ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించామని, వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
-
Home
-
Menu
