ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి

Pranay murder accused Abdul Bari dies
X

Pranay murder accused Abdul Bari dies

చర్లపల్లి జైలులో ఛాతీ నొప్పి.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో దోషిగా ఉన్న అబ్దుల్ బారీ కస్టడీలో మృతి చెందాడు. గురువారం (సెప్టెంబర్‌ 24) చర్లపల్లి జైలులో ఛాతీ నొప్పి రావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నాలుగో నిందితుడైన బారీకి 2025 మార్చిలో నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడితో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు, కాంట్రాక్ట్‌ కిల్లర్‌ సుభాష్‌ కుమార్‌ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

పట్టపగలే ప్రణయ్ హత్య

2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో 24 ఏళ్ల ప్రణయ్‌ కుమార్‌ పెరుమాళ్లను ఆస్పత్రి బయట పట్టపగలే హత్య చేశారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌, ఐదు నెలల గర్భవతిగా ఉన్న భార్య అమృత వర్షిణితో కలిసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా దుండగుడు వెనుక నుంచి కత్తితో దాడి చేయడంతో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడి దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీలో నమోదయ్యాయి. భార్య, తల్లి కళ్ల ముందే జరిగిన ఈ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

రూ.కోటి కాంట్రాక్ట్‌?

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడు కూడా హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్దుల్‌ కరీమ్‌ ద్వారా బారీని సంప్రదించాడు. బారీ, అస్గర్‌ అలీ కలిసి కాంట్రాక్ట్‌ హత్యకు ఏర్పాట్లు చేసినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. చివరకు రూ.కోటి మొత్తానికి ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరువు హత్య నేపథ్యంలో జరిగిన ఈ హత్య తెలంగాణలో విస్తృత చర్చకు దారితీసింది. ప్రణయ్‌ హత్య అనంతరం కుల వివక్ష, కులాంతర వివాహాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

Tags

Next Story