పగిడిద్దరాజు గద్దెను కదలించిన పూజారులు

మేడారంలో పగిడిద్దరాజు గద్దెను పగిడిద్దరా జు పూజారులు ఆదివారం కదలించారు. పగిడిద్దరాజు పూజారులు గదిలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ, గోవిందరాజు పూజారులతో కలిసి గద్దెల వద్దకు వెళ్లారు.అమ్మవార్ల గద్దెల చుట్టు డోలివాయిద్యాలతో ప్రదక్షిణలు చేసి తల్లుల గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. గోవిందరాజు గద్దె వద్ద కూడా పూజలు చేశారు. అనంతరం పగిడిద్దరాజు గద్దె వద్ద పసుపు, కుంకుమలు, కంకణాలు కట్టి పూజలు నిర్వహించారు. గడ్డపారను పవిత్రజలంతో శుద్ది చేసి పసుపు, కుంకుమ రాసి కంకణం కట్టారు. అనంతరం పూజారులు కొబ్బరికాయాలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐదుగురు పూజారులు కలిసి శుద్ది చేసిన గడ్డపారతో గద్దెను మూడసార్లు కదలించారు. అమ్మవార్ల గద్దెల వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పునర్నిర్మాణం చేస్తున్న క్రమంలో నూతన పగిడిద్దరాజు గద్దెను ప్రతిష్టించనున్న సందర్భంగా ఆదివారం పగిడ్దిరాజు పూజారులు గద్దె కదలింపునకు మంచి రోజు కావడంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించినట్లు పూజారులు తెలిపారు. కదలించిన మట్టితో నూతన గద్దెను ఏర్పాటు చేస్తామని పూజారులు వివరించారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన కార్యదర్శి కాక సార య్య, ఉపాధ్యక్షుడు చందా గోపాల్‌రావు, పూజారులు కాక వెంకటేశ్వర్లు, చందా రఘుపతిరావు, వెంకన్న పాల్గొన్నారు.
-
Home
-
Menu
