నెహ్రూ వాటిని ఆరంభించకపోయి ఉంటే..?: ప్రియాంక గాంధీ

పధాని మోడీ విమర్శలకు కాంగ్రెస్ సభ్యురాలు, గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా కౌంటర్ ఇచ్చారు. వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ తరపున ఆమె మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు ఉన్నందునే బిజెపి వందేమాతరంపై ప్రత్యేక చర్చ చేపట్టిందన్నారు. జాతీయ గేయం ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నదని, ప్రజా సమస్యలు ఇప్పుడు దేశంలో ఎన్నో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఈ చర్చ ఇప్పుడు చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు. భవిష్యత్‌ను వదిలి ప్రధానమంత్రి గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యను పక్కనపెట్టి వందేమాతరం చర్చ చేపట్టి అందులో నెహ్రూపై ప్రధానమంత్రి విమర్శలకు పాల్పడుతున్నారని, అయితే నెహ్రూపై కూడా ఈ తరహాలోనే చర్చకు సమయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఆయన గురించి ఒక జాబితా రూపొందించి అంశాల వారీగా మాట్లాడుకుందామని ప్రియాంక సూచించారు.
ప్రియాంక ప్రధాని మోడీపై పదునైన విమర్శలు గుప్పించారు. ‘మీరు పదేపదే నెహ్రూతో పాటు ఆయన వారసత్వంపై విమర్శలకు దిగుతున్నారు. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉంటున్నారు. కానీ నెహ్రూ 17 ఏళ్లు ఆ పదవిని అధిష్టించారు. ఆయనపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయన ఇస్రో ఆరంభించకపోయి ఉంటే ఈనాడు మంగళయాన్ ఉండకపోయేది. ఆయన డిఆర్‌డిఓను తీసుకురాకపోయి ఉంటే తేజాస్ మనుగడ సాధ్యమయ్యేదా?. నెహ్రూ ఐఐటిలు, ఐఐఎంలు ప్రారంభించకపోయి ఉంటే ఐటి ఎక్కడిది? ఆయన ఎయిమ్స్ మొదలు పెట్టి ఉండకపోతే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నలు గుప్పించారు.
నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 9 సార్లు జైలు పాలయ్యారు. మొత్తం 3200 రోజులు కారాగారంలో ఉన్నారని గుర్తు చేశారు. నెహ్రూను అవమానించదలచుకుంటే ఒక జాబితా తయారు చేయాలని, ఆ సంఖ్య 99 లేదా 999 మీ ఇష్టం అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమయం నిర్ణయించి చర్చ చేపడితే దానికి మేం సిద్ధమని ప్రియాంక సవాల్ విసిరారు. ఇందిర, రాజీవ్ ఈ దేశానికి ఏం చేశారు? వారసత్వ రాజకీయాలు అంటే ఏంటీ? నెహ్రూ చేసిన తప్పిందాలు ఏమేం ఉన్నాయి వీటన్నింటిపై చర్చ చేపడదామన్నారు. అదే సమయంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కూడా మాట్లాడుకుందామని ప్రియాంక పేర్కొన్నారు.
-
Home
-
Menu
