జ్ఞానేశ్ తప్పుకో..

జ్ఞానేశ్ తప్పుకో..
X

న్యూఢిల్లీ: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) విషయంపై ఎన్నికల సంఘంలో విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్‌షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వాళ్లు దేశద్రోహులు..భారతదేశ ఓటు హక్కును నాశనం చేశారు’ అని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చేసిన పని భారతదేశానికి వ్యతిరేకమైన చర్య అని ఆరోపించారు. వెంటనే సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాభవన్‌లో మీడియాతో గురువారంనాడు ఆయన మాట్లాడుతూ, ఇది రాజ్యాంగంపై, దేశ న్యాయవస్థపై జరిగిన దాడి అని, ఓటు రక్షించే బాధ్యత సీఈసీపై ఉందని, దీనిని నిర్ధారించేందుకు తమ వద్ద తగినంత సమాచారం ఉందని అన్నారు. ‘దీనికి పరిణామాలు ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంటే మేము మౌనంగా ఉండం. దీనికి బాధ్యులైన వారికి శిక్ష పడుతుంది’ అని పేర్కొన్నారు.

అప్రూవర్‌గా మారితే మంచిది

జ్ఞానేశ్ కుమార్ అప్రూవర్‌గా మారడం మంచిదని రాహుల్ సలహా ఇచ్చారు. అలా చేయడం దేశభక్తి చర్య అవుతుందన్నారు. అప్పుడు ప్రధాని మోడీ, హోం మంత్రి షా ఇద్దరినీ జరుగుతున్న వ్యవహారాలపై విచారిస్తారని, ఆ కుట్రకే వారే ప్రధాన బాద్యులని ఆరోపించారు.

ఇవిగో వీడియోలు..

మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ కొన్ని వీడియోలను ప్రదర్శించారు. మోదీ, అమిత్‌షా మాటల తీరును గమనించాలని ప్రజలను కోరారు. ఈ వీడియోల్లో బీజేపీ 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్‌షా చెబుతుండగా, ప్రధాని మోడీ ‘అబ్‌కీ బార్ 400 పార్’ అని నినాదం చేయడం వినిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడు ఇలాటి వ్యాఖ్యలు చేయరాదని రాహుల్ అన్నారు. భారతదేశంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే ప్రాథమిక శక్తి ఉందని, అది అధికారాన్ని ప్రతిఘటించడం ప్రారంభింస్తుందని, ఎవరినీ వదిలిపెట్టదని రాహుల్ అన్నారు. ‘ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించారు. అయినప్పటికీ ఒకటి, రెండేళ్లలోనే యాంటీ-ఇంకబెన్సీ కారణంగా తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఒక్కొక్క నాయకుడి విషయంలోనూ ఇది జరిగింది.

కానీ, మోడీ, షా, బీజేపీ విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. ఇప్పుడు దానికి సమాధానం మనకు తెలుసు’ అని అన్నారు. ఒక వ్యక్తి ప్రజాదరణను, ప్రభుత్వం పనితీరును మనం అర్ధం చేసుకోగలమని, కానీ ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా అదృశ్యమవ్వడం ఎలా? అని ప్రశ్నించారు. సద్దాం హుస్సేన్ పాలనలోని ఇరాక్‌లోనూ, ఉత్తర కొరియాలోనూ కూడా ఇది లేదని అన్నారు. ఎన్నికల సంఘమే ఓటుకు సంస్థాగత రక్షకుడని, అక్కడి నుంచే మిగతావన్ని ఉత్పన్నమవుతాయని, ఓటు నాశనమైతే రాజ్యాంగం పనిచేయదని, చట్టాలు ధ్వంసమవుతాయని, సంస్థలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్‌కు గురయ్యాయని తాను 100 శాతం కచ్చితంగా చెప్పగలనని అన్నారు.

Tags

Next Story