అమరావతికి రైతుల త్యాగం ఎప్పటికి మరువలేనిది: కె. లక్ష్మణ్

ఢిల్లీ: గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని బిజెపి ఎంపి కె. లక్ష్మణ్ తెలిపారు. వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఎపికి మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కె. లక్ష్మణ్ మాట్లాడారు. రాజధాని కోసం పోరాడిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అమరావతికి రైతుల త్యాగం ఎప్పటికి మరువలేనిదని తెలియజేశారు. అమరావతి కోసం సుదీర్ఘమైన పోరాటం చేసిన రైతులకు తన నమస్కారం అని.. భవ్య రాజధాని నిర్మాణం కోసం 29 వేల మందికి పైగా రైతులు భూములు ఇచ్చారని అన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. తెలుగుజాతి చరిత్ర అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కె. లక్ష్మణ్ సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారని, 58 రోజుల తర్వాత ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ప్రశంసించారు. ఎపి, తెలంగాణను కొంతమంది ప్రముఖులు విలీనం చేశారని, తెలంగాణకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని.. చొక్కాలు మార్చినట్లు సిఎంలను కాంగ్రెస్ మార్చిందని మండిపడ్డారు. తెలుగు ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ పార్టీ స్థాపించారని, కాంగ్రెస్ విధానాలపై ఎన్టిఆర్ పోరాటం చేశారని కె. లక్ష్మణ్ పేర్కొన్నారు.
-
Home
-
Menu
