గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

గురుకుల పాఠశాలలో  14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
X

నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరిచిన సంఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పక్కనే ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి గురుకుల విద్యార్థినుల పరిస్థితిని వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 14 మంది విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆయన వర్గం తెలిపింది. దీంతో గేటు ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ మండల శ్రేణులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరుస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారు..? బీఆర్‌ఎస్ హయాంలో తాను సంవత్సరానికి రెండుసార్లు పాఠశాలకు వచ్చేవాడినని,

అధికారుల ద్వారా విద్యార్థుల అవసరాలు తెలుసుకుని వాటిని పరిష్కరించేవాడినని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి ఘటనలు ఒక్కటి జరగలేదన్నారు. గతంలో ఇదే పాఠశాల వాచ్‌మెన్‌ను పాము కరిచిన ఘటన జరిగిందని తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థినుల భద్రత విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. పిల్లలకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. విద్యార్థుల భద్రతపై తక్షణ చర్యలు అవసరం. గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, పారిశుద్ధ్యం, వసతుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినవసరం ఉంది. బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఘటనకు దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ధర్నాకార్యక్రమంలో బీఆర్‌ఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story