ఓటమి బాధ్యత ప్రతి ఒక్కరిది.. ప్రజలు గుర్తించాలి: రవిశాస్త్రి

Ravi Shastri
X

భారత గడ్డపై దక్షిణాఫ్రికా దాదాపు 25 సంవత్సరాల తర్వాత టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించింది. 1999-2000 సంవత్సరంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా.. భారత్‌ను 2-0 తేడాతో ఓడించింది. మళ్లీ ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లోనూ అదే ఫలితం సాధించింది. అయితే టెస్ట్ సిరీస్‌లో ఓటమికి భారత్ వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గి సఫారీలను చిత్తు చేసింది. అయితే టెస్ట్ సిరీస్‌లో ఓటమికి చాలా మంది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శించారు. తాజాగా దీనిపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓటమికి బాధ్యత ప్రతి ఒక్కరిదని.. కేవలం ఒకరిని నిందించడం సరైనది కాదని రవిశాస్త్రి ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.

‘‘ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యత ఉందని ప్రజలు గుర్తించాలి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. గతంలో నా విషయంలోనూ అదే జరిగింది. ఆ అనుభవంతోనే నేను మాట్లాడుతున్నా. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకొని.. వైఫల్యాలను అంగీకరించాలి. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఆటగాళ్లు వరకు ఒక్కరిని మాత్రమే బాధ్యులను చేయడం సమంజసం కాదు. ధక్షిణాఫ్రికా.. భారత్‌ను ఓడించింది. అంతేకానీ.. ఏ ఒక్క దక్షిణాఫ్రికా ఆటగాడు, భారత్‌ను ఓడించలేదు. వాళ్లు ఓ జట్టుగా బాగా ఆడారు. మనం ఆడామా?’’ అని రవిశాస్త్రి అన్నారు.

Tags

Next Story