కిరాణా షాపులో పేలిన ఫ్రిడ్జ్

కిరాణా షాపులో పేలిన ఫ్రిడ్జ్
X

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఓ కిరాణా దుకాణంలో ఫ్రిడ్జ్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కంటాల హనుమంతు గుప్తా నిర్వహిస్తున్న కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోజు మాదిరి గానే రాత్రి దుకాణం మూసి వేసి వ్యాపారి షాప్ ఇంటి పై భాగంలో కుటుంబంతో ఉంటాడు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దుకాణంలో ఫ్రిజ్ ఒక్కసారిగా పేలి పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న నూనె డబ్బాలు, కిరాణా సరుకులు, ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

దుకాణం నుండి దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే దుకాణ యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని బాధిత వ్యాపారి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story