తుపాకీ మిస్‌ఫైర్.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

తుపాకీ మిస్‌ఫైర్.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి
X

నిజామాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్.సతీష్ (41) ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో మృతి చెందారు. నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఎన్‌ఎస్‌ఓ)గా విధులు ముగించుకుని వచ్చిన అనంతరం తన సర్వీస్ ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం హెడ్‌క్వార్టర్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పోలీసు వర్గాల్లో విషాదం నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన సతీష్ 2009 బ్యాచ్‌కు చెందినవారు. అదే ఏడాది పోలీసు శాఖలో విధుల్లో చేరారు. అనంతరం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. గత మూడేళ్లుగా నిజామాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఓగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గురువారం రాత్రి నైట్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సతీష్.. శుక్రవారం ఉదయం హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చారు.

అనంతరం తన సర్వీస్ ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని చూడగా సతీష్ తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మిస్‌ఫైర్‌కు దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రమాదవశాత్తు తుపాకీ ఎలా పేలింది, ఆయుధాన్ని శుభ్రం చేసే సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సతీష్ మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags

Next Story