నిర్మల్‌లో సిఎం.. ఉమ్మడి ఆదిలాబాద్‌కు వరాల జల్లు

CM Revanth Reddy
X

నిర్మల్: పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నిర్మల్‌కి వచ్చానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్టిఆర్ మినీ స్టేడియంలోని బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘‘నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సిఎం అయ్యాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి బహిరంగ సభ పెట్టాం. ఆదిలాబాద్ జిల్లా పోరాటానికి, పౌరుషానికి నెలవైన గడ్డ. జల్, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం కొట్టాడారు’’ అని అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని సిఎం పేర్కొన్నారు. ‘‘పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ జిల్లాకు నిధులు ఇస్తాం. పారిశ్రామికంగానూ అదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. కెసిఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి చెందేది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేదు. ఆదిలాబాద్ జిల్లాకు వర్సిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా. ఆదిలాబాద్‌ జిల్లాకు యూనివర్సిటీ వస్తుంది. బాసర ఐఐఐటిలోనే యూనివర్సిటీని ప్రారంభిస్తాం. బాసర ఐఐఐటిలోనే యూనివర్సిటీ ఏర్పాటుకు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లిని కోరుతున్నా’’ అని సిఎం తెలిపారు.

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాల్సిందే.. ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇవ్వాల్సిందే అని సిఎం అన్నారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్టు తీసుకొస్తాం. ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్‌బస్‌ను తీసుకొస్తాం. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానిద్దాం. ఎయిర్‌పోర్టు కోసం 10 వేల ఎకరాల భూమి సేకరించాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధాని వద్దకు వెళ్తున్నాం. రాష్ట్ర బిజెపి నేతలు ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి ప్రాజెక్టులు నిధులు తేవాలి. అభివృద్ధి, నిధుల కోసం ఎవరినైనా కలవడానికి నేను ఆలోచించను. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం.. అడగాల్సిన ప్రాజెక్టులు అడిగాం ’’ అని పేర్కొన్నారు.

Tags

Next Story