ఎర్ర బస్సు కూడా రాని ఆదిలాబాద్‌ కు ఎయిర్‌బస్సును తీసుకువస్తాం: రేవంత్

ఎర్ర బస్సు కూడా రాని ఆదిలాబాద్‌ కు ఎయిర్‌బస్సును తీసుకువస్తాం: రేవంత్
X

ఆదిలాబాద్: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి రైతుల పొలాల్లో సాగు జలాలు పారించే సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం సస్యశ్యామలం, సాగు జలాలతో పచ్చటి పొలాలను తడపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హతిఘాట్ లో చనాక- కొరాటా పంప్ హౌస్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. నిధులు, ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టుల కోసమే ప్రధాని మోడీని కలుస్తున్నామని ఆయన నాకు చుట్టం కాదన్నారు. ప్రధాని మోడీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, కావాల్సిన నిధులు అడుగుతున్నామన్నారు. పదేళ్లు ఏలినవారు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదని, ఇలాంటి చిక్కుముళ్లు విప్పుకుంటూ రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఎర్ర బస్సు కూడా రాని ఆదిలాబాద్‌ జిల్లాకు ఎయిర్‌బస్సును తీసుకువస్తామని, ప్రధాని మోడీ చేతులమీదుగా ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేయిస్తామన్నారు. ప్రతీ 3 నెలలకు ఒకసారి మోడీ దగ్గరకు వెళ్తున్నామని, ప్రతీ 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నామని, రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కోసం విజ్ఞప్తులు చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా పోరాటాల పురిటి గడ్డ అని, జల్‌ జంగిల్‌ జమీన్‌ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉందని, పాలమూరు జిల్లాతో సమానంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉందన్నారు. గత పదేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Tags

Next Story