డల్లాస్‌లో ఇండియన్స్‌పై పెరుగుతున్న ద్వేషం

ఫ్రిస్కోలో జెండా చింపివేత.. ‘గో బ్యాక్’ నినాదాలు
హెచ్-1బీ నుంచి ‘ఇండియన్ టేకోవర్’ వరకు పెరుగుతున్న విద్వేష ప్రచారం
*మన తెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్–ఫోర్ట్‌వర్త్ ప్రాంతంలో భారతీయ అమెరికన్లపై పెరుగుతున్న వ్యతిరేకత మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డల్లాస్ శివారు నగరమైన ఫ్రిస్కోలో భారతీయుల సంఖ్య పెరగడం, హెచ్-1బీ వీసాలు, వలస విధానాలపై ఉన్న రాజకీయ విభేదాలు క్రమంగా జాతి విద్వేష వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం సిటీ కౌన్సిల్ సమావేశాలు, రాజకీయ నిరసనలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
జెండా చింపివేత.. ‘గో బ్యాక్’ నినాదాలు
జూన్ 3న ఫ్రిస్కో సిటీ హాల్ వెలుపల జరిగిన నిరసనలో ఓ వ్యక్తి భారత జాతీయ జెండాను చింపివేయడం, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. అదే సమయంలో నిరసనల్లో వలసదారులను లక్ష్యంగా చేసుకుని గో బ్యాక్’ (తిరిగి వెళ్లిపోండి)* వంటి నినాదాలు వినిపించడం భారతీయ అమెరికన్ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులు కూడా ఇలాంటి నినాదాలకు గురికావడం, వలస విధానంపై ఉన్న రాజకీయ చర్చను జాతి లేదా జాతీయత ఆధారిత విద్వేషంగా మార్చుతున్నారన్న విమర్శలకు దారితీసింది.
‘ఇండియన్ టేకోవర్’ అంటూ ప్రచారం
ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశాల్లో భారతీయ వలసదారులు, హెచ్-1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు కూడా వినిపించాయి. కొందరు వక్తలు భారతీయుల సంఖ్య పెరుగుదలను ‘ఇండియన్ టేకోవర్’గా అభివర్ణిస్తూ, వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను దక్కించుకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. ఫ్రిస్కోలో గత రెండు దశాబ్దాల్లో జనాభా, సామాజిక నిర్మాణం గణనీయంగా మారింది. ప్రస్తుతం నగర జనాభాలో భారతీయుల వాటా గణనీయంగా ఉందని అమెరికా జనాభా లెక్కల ఆధారంగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ మార్పును కొందరు సాంస్కృతిక పరివర్తనగా చూస్తుండగా, మరికొందరు వలస విధానాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
సాంస్కృతిక భేదాలపై చర్చ
భారతీయ సమాజంలోని కొన్ని సాంస్కృతిక ప్రవర్తనలపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భారతీయ సినిమాల తొలిరోజు ప్రదర్శనల్లో కేరింతలు, ఈలలు, బహిరంగ వేడుకలు వంటి వాటిపై కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నిర్దిష్ట ప్రవర్తనలపై చర్చను మొత్తం భారతీయ సమాజంపై ‘గో బ్యాక్’ వంటి నినాదాలకు తీసుకెళ్లడం వేరే అంశమని భారతీయ అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపీల ఖండన
ఫ్రిస్కో ఘటనపై భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, అమీ బెరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, శ్రీ థానేదార్, సుహాస్ సుబ్రమణ్యం స్పందించారు. భారత జెండా చింపివేతతో పాటు భారత్ వ్యతిరేక, వలసదారులపై విద్వేషపూరిత ప్రచారాన్ని వారు ఖండించారు. ఏ సమాజాన్నీ బెదిరింపులు, వివక్షకు గురిచేయరాదని పేర్కొన్నారు.
Tags
-
Home
-
Menu
