రూ. లక్షన్నర దాటిన బంగారం..

రూ. లక్షన్నర దాటిన బంగారం..
X

బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. మంగళవారం ఫ్యూచర్ ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షలు దాటింది. మరోవైపు వెండి కిలో రూ.3.27 లక్షలతో జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసిఎక్స్)పై ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.6,861 (4.7 శాతం) పెరిగి రూ.1,52,500 చేరగా, క్రితం రోజు ఇది రూ.1,45,639 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల 2026 ప్రారంభం నుంచి బంగారం ఆగకుండా పెరుగుతూనే ఉందని, రూపాయి మాత్రం క్షీణిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండి కూడా వరుసగా పెరుగుతూ చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరింది.

వరుసగా రెండో సెషన్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.17,723 (6 శాతం) పెరిగి సరికొత్త రికార్డు స్థాయి రూ.3,27,998 కి చేరింది. సోమవారం నాడు కిలో వెండి ధర రూ.3 లక్షల మార్క్ దాటింది. కేవలం రెండు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.32,187 (11 శాతం) పెరిగింది. ఈ నెల 16న వెండి ధర రూ.2,87,762 వద్ద ఉంది. ఈ సందర్భంగా లెమన్ మార్కెట్ డెస్క్ రిసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ స్పందిస్తూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు గ్లోబల్‌గా, దేశీయంగా సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఫిబ్రవరి డెలివరీకి కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒక ఔన్స్ 147.5 (3.21 శాతం) పెరిగి 4,743 డాలర్లకు చేరుకుంది

Tags

Next Story