ఎర్రవల్లిలో పసుపు నీటితో రోడ్డు శుద్ధి

ఎర్రవల్లిలో పసుపు నీటితో రోడ్డు శుద్ధి
X

అసెంబ్లీలో స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో ప్రారంభమైన రచ్చ తదనంతర పరిణామాలను చూస్తే ఇరుపార్టీల మధ్య వివాదం ముదురుతోందనిపిస్తోంది. మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకులు, కార్యకర్తలతో డప్పులతో వెళ్లడం కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల వధ్య తీవ్ర వాగ్వాదాలతో ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఎర్రవల్లి, వరదరాజ్‌పూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇరుపార్టీల శ్రేణులు పరస్పరం పెద్ద ఎత్తున పోటీ పడి దిష్టిబొమ్మలను దహనం చేయడం, ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయటం వంటి వాటితో అట్టుడికిపోయింది. వరదరాజ్ పూర్‌కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి సతీష్ మాదిగల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో డప్పుల మోతతో కార్యకర్తలు ఎర్రవల్లి వైపు బయలు దేరారు. కొద్ది దూరంలోనే పోలీసులు అడ్డుకుని వారిని ఆపివేశారు.ఇదే సమయంలో ఇరువర్గాల మధ్య గొడవలకు దారితీయడంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు.

ఓ వైపు గొడవ జరుగుతుండగానే కొందరు బిఆర్‌ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధి పావనిగౌడ్ తదితరులు వరదరాజ్‌పూర్ వద్ద రోడ్లపై శుద్ధి పేరిట పసుపు నీటిని చల్లారు. కాంగ్రెస్ పార్టీవారు కాలుమోపడంతో ఈ ప్రాంతం అపవిత్రంగా మారిందని అందుకే శుధ్ది చేశామని నిర్వాహకులు చెప్పుకున్నారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు వరదరాజ్ పూర్‌లో శుద్ధి చేస్తున్న తరుణంలో అక్కడికి వచ్చిన పోలీసులు వారించారు. బిఆర్‌ఎస్ కార్యకర్తల చేతుల్లో ఉన్న పసుపు నీళ్ల బకెట్లను లాక్కుని అక్కడి నుంచి వారిని పంపించి వేశారు. ఈ సంఘటన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అధికార పక్షం వారు దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నారు. ఈ పసుపు నీళ్లతో వీధుల శుద్ధి తతంగంపై అసెంబ్లీలో చర్చ సాగుతుండగానే ఎర్రవల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పసుపు నీటితో శుద్ధి చేయడం విస్మయానికి గురిచేసింది. ఎర్రవల్లిలో పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ బాలరాజు,సర్పంచ్ భర్త రాంమోహన్ రెడ్డి,మల్లేష్ ,కొందరు వార్డుసభ్యులు ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంఘటన మరోసారి వివాదస్పదంగా మారుతోంది.

Tags

Next Story