జుక్కల్ లో ఆర్ టిసి బస్సు బోల్తా: డ్రైవర్ మృతి... స్పందించిన మంత్రి పొన్నం

కామారెడ్డి: ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో జరిగింది. జుక్కల్ చౌరస్తా–కేంరాజ్ హైవేపై హైదరాబాద్-1 డిపోకు చెందిన ఆర్ టిసి బస్సు బోల్తా పడడంతో డ్రైవర్ దుర్మరణం చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్-1 డిపోకు చెందిన టిఎస్ 34 జడ్ 0030 అనే బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న సమయంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సు డ్రైవర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని బాధను వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పొన్నం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారన్నారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. అవసరమైన అన్ని వైద్య సహాయ చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించానని వివరించారు. ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Tags
-
Home
-
Menu
