సమయం కావాలని కెసిఆర్ కోరితే రెండు రోజులే ఇస్తారా..? : సబితా ఇంద్రారెడ్డి

కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమే కెసిఆర్‌కు రెండో సారి నోటీసులు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వానికి, ఏ మాత్రం పసలేని కేసులో అంత తొందర ఏముందో..? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నారని, మరొక సమయం కావాలని కెసిఆర్ కోరితే కేవలం రెండు రోజుల వ్యవది మాత్రమే ఇస్తారా..? అని అడిగారు. రాష్టాన్ని సాధించి, తెలంగాణ వైభవాన్ని గొప్పగా చాటిన మహా నేతకు మీరిచ్చే గౌరవం ఇదేనా...? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు కెసిఆర్‌ను నోటీసులతో వేదిస్తే తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. చావు నోట్లో తల పెట్టి రాష్టాన్ని సాధించిన తెలంగాణ జాతి పితకు నోటీసులా...తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన పెద్దాయనపై కక్ష సాధింపా..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్టాన్ని వ్యతిరేకించిన శక్తులే నేడు తెలంగాణలో పాలన కొనసాగిస్తూ, కెసిఆర్ లాంటి మహనీయులపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎప్పటికి చరిత్రహినులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
-
Home
-
Menu
