ఖమ్మంలో అంగన్వాడీ కేంద్రంలో బచ్చలకూరకు బదులు గన్నేరు ఆకులతో వండిన కూర.... పిల్లల ఆరోగ్యం విషమం

ఆకులు కలవడంతో అస్వస్థతకు గురైన పిల్లలు...
ఆకు కూర పప్పులో గన్నేరు ఆకులు కలవడంతో అస్వస్థతకు గురైన పిల్లలు...
అంగన్‌వాడి కేంద్రం నిర్వహణపై తీవ్ర ఆరోపణ
మన తెలంగాణ/సత్తుపల్లి రూరల్: ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం 3 లో టీచర్ నిర్లక్ష్యంతో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్‌వాడీలో చిన్నారులకు అందించిన ఆహారంలో పప్పులు గన్నేరు ఆకులు కలవడంతో అదే ఆహారాన్ని పిల్లలకు పెట్టారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బచ్చలికూర ఆకులతో గన్నేరు ఆకులు పప్పుతో కలిసి కూర చేసినట్టు సమాచారం. దీంతో ఐదుగురు చిన్నారులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనను బయటకు రాకుండా మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పిల్లలకు చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం ఆసుపత్రి నుండి వరంగల్ తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదని, తమను నిర్బంధిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై సత్తుపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
-
Home
-
Menu
