నక్కా సుశీల లొంగుబాటు

మావోయిస్టు ఉద్యమంలో మూడు దశాబ్దాలకు పైగా కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ డిసిఎం నక్కా సుశీల రాణి అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత నిజామాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డివిసిలో డివిజన్ కమిటీ సభ్యురాలిగా, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ సభ్యురాలిగా ఆమె పనిచేశారు. 1992లో ప్రారంభమైన ఆమె మావోయిస్టు ప్రస్థానానికి ముగింపు పలికారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్ నగర్‌కు చెందిన నక్కా సుశీల హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు.
డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులై 1992లో అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లారు. తొలుత హైదరాబాద్ సిటీ కమిటీ సాంకేతిక విభాగంలో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పని చేశారు. అనంతరం వివిధ దళాలు, కమిటీల్లో బాధ్యతలు నిర్వహిస్తూ 1996లో ఎసిఎంగా, 2002లో డిసిఎంగా పదోన్నతి పొందారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం, దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతాల్లో పని చేశారు. 2009లో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీలో సభ్యురాలయ్యారు. 2011లో బేసిక్ కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2012 నుంచి 2014 వరకు పిఎల్‌జిఎ బెటాలియన్---2 క్యాడర్‌కు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. 2014 నుంచి 2025 జనవరి వరకు మాడ్ డివిసిలో కొనసాగుతూ పలు క్యాడర్‌కు రాజకీయ శిక్షణ ఇచ్చారు.
రూ.5 లక్షల రివార్డు.. రూ.25 వేల సాయం
తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం సుశీలకు రూ.5 లక్షల రివార్డు మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. తాత్కాలిక ఆర్థిక సహాయంగా రూ.25 వేలు అందజేశారు. ఇతర ప్రయోజనాలతోపాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కల్పించనున్నట్లు సిపి తెలిపారు.
బుల్లెట్ గాయమైనా.. అజ్ఞాతాన్ని వీడలేదు
1998లో నల్లమల అడవుల్లోని పావురాలగట్ ఘటనలో సుశీలకు ఛాతీ, ఎడమ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స పొంది తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చేరారు. 2001 నల్లమల.. 2005లో ఒడిశాలోని మల్కాన్‌గిరిలో.. 2008, 2024లలో ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లోనూ పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో తొడ ఎముక స్థానంలో రాడ్ అమర్చారు. అయినప్పటికీ దాదాపు 34 ఏళ్లపాటు ఉద్యమంలో కొనసాగారు.
ఈ ఏడాది 266 మంది లొంగుబాటు
2026లో ఇప్పటివరకు తెలంగాణలో 266 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిసిఎస్/డివిసిఎంలు, 94 మంది ఎసిఎస్/ఎసిఎంలు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. 2024 నుంచి 2026 వరకు మొత్తం 824 మంది లొంగిపోయారు. ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల సమన్వయంతో చేపట్టిన చర్యలు ఈ పరిణామానికి దోహదపడ్డాయని పోలీసు శాఖ పేర్కొంది.
అజ్ఞాతంలో ముగ్గురే!
తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టుల పేర్లను పోలీసులు వెల్లడించారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్ష శేఖర్ అలియాస్ మంగీ మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు.
-
Home
-
Menu
