ధాన్యం ఉత్పత్తిలో సిద్దిపేట అగ్రగామి

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికే సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. విజయదశమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, ఎన్సన్ పల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో నిర్వహించిన దసరా ఉత్సవాలు, రావణ దహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని అన్నారు. గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావడంతో ధాన్యం ఉత్పత్తి 50 వేల మెట్రిక్ టన్నుల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు, రైలు సౌకర్యం, గోదావరి జలాలు రావడం ఒకప్పుడు నినాదాలుగా ఉండేవని, ప్రజల ఆశీర్వాదంతో వాటిని నిజం చేసుకున్నామని అన్నారు. రూ.400 కోట్లతో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత సిద్దిపేట మీదుగా ఉత్తర భారతదేశానికి ప్రతి 20 నిమిషాలకు ఒక రైలు నడవనుందని చెప్పారు.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరవు ఉన్నా సిద్దిపేటలో సాగు, తాగునీటికి కొరత లేదన్నారు. సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారిందని, గోదావరి జలాలు పారిన తర్వాత బీడు భూములన్నీ పచ్చని పొలాలుగా మారాయన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా లాభం చేకూరిందన్నారు. వివిధ విద్యా సంస్థలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నామని, పేదరికం వైద్య విద్యకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసుకుందామన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ముందున్న సిద్దిపేట.. అభివృద్ధిలోనూ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని అన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన వెంట నాయకులు కడవేరుగు రాజానర్సు, కొండం సంపత్ రెడ్డి, వంగ తిరుమల్ రెడ్డి, కనకయ్య, ప్రశాంత్, ఎల్లం, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
-
Home
-
Menu
