కిలో వెండి @ రూ.3 లక్షలు

వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సోమవారం ఫ్యూచర్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3 లక్షల మార్క్‌ను దాటింది. గ్రీన్‌లాండ్ కారణంగా వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అమెరికా డాలర్ బలహీనపడడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా వెండికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఎంసిఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్సేంజ్)పై సిల్వర్ ఫ్యూచర్ కిలో ధర దాదాపు 6 శాతం (రూ.16,438) పెరిగి రూ.3,04,200 ను తాకింది. గత వారంలో కూడా సిల్వర్ ఫ్యూచర్ దాదాపు 14 శాతం (రూ.35,037) పెరిగింది. 2026 ప్రారంభం నుండి కిలో వెండి దాదాపు రూ.68,499 (29 శాతం) పెరగ్గా, ఇది 2025 డిసెంబర్ 31న కిలో రూ.2,35,701 గా ఉంది. అదే సమయంలో బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కు గోల్డ్ రేటు రూ.2,983 (2.09 శాతం) పెరిగి రూ.1,45,500 కు చేరింది. గత వారం ఎంసిఎక్స్‌లో బంగారం ధర రూ.3,698 (2.7 శాతం) పెరిగింది.
కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి మాట్లాడుతూ, ఎంసిఎక్స్ మార్కెట్లో వెండి, బంగారం రెండింటి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. కిలో వెండి ధర రూ.3,00,000 మార్క్ దాటగా, 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,000 కు చేరుకుందని అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడడం, సరఫరా వ్యవస్థపై ఆందోళనలు వంటి కారణాల వల్ల విలువైన లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో జరుగుతున్న పరిణామాల వల్ల కొన్ని యురోపియన్ దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం కూడా వెండి, పసిడి ధరల పెరుగుదలకు కారణమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మార్చి డెలివరీ కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర 5.81 డాలర్లు (6.56 శాతం) పెరిగి రికార్డు స్థాయిలో ఔన్స్ 94.35 డాలర్లకు చేరింది. గోల్డ్ 2.23 శాతం పెరిగి 4,698 డాలర్లకు చేరింది.
-
Home
-
Menu
