బస్సు-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి, 15మందికి గాయాలు

సికార్: రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఫతేపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక వివరాల ప్రకారం, జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
-
Home
-
Menu
