సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి పోస్టు... సూసైడ్

కరీంనగర్: ఓ వ్యక్తి తన పేరు మీద శ్రద్ధాంజలి పోస్టు చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..... పెద్దాపురం గ్రామంలో బందారపు సురేశ్(34) అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అప్పులు చేసి జీవనోపాధి నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం ఖతార్ దేశానికి వెళ్లాడు. ఖతార్ ఉండలేకి మళ్లీ తన సొంతూరుకు వచ్చాడు. అతడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో అప్పులు చేసి ఇల్లు నిర్మించాడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. బతుకమ్మ పండుగ సందర్భంగా తన భార్యను అత్తగారింటికి పంపించాడు. దీంతో అతడు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. శుక్రవారం తన ఫొటోకు దండవేసి అనంతరం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పురుగుల మందు తాగి తన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆమె గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు అతడు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
