ఎల్లంపల్లి ఎత్తిపోతల షురూ..

ఎల్లంపల్లి ఎత్తిపోతల షురూ..
X

పెద్దపల్లి జిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నంది రిజర్వాయర్ ద్వారా శుక్రవారం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. వరద కాలువ ఆధారంగా పంటలు సాగు చేస్తున్న రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని అర టిఎంసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలతో నంది రిజర్వాయర్‌లో ఐదో బాహుబలి మోటార్‌ను ఆన్ చేసి 3,150 క్యూసెక్కుల గోదావరి జలాలను నంది రిజర్వాయర్‌లోకి పంపిస్తున్నారు. అంతే మొత్తంలో నంది రిజర్వాయర్ నుండి ఎగువనున్న గేట్ల ద్వారా సొరంగ మార్గాల గుండా గాయత్రి పంప్‌హౌస్‌కు తరతలించి లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్‌ను ఆన్‌చేసి వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు రోజులపాటు కొనసాగనుంది. నిజామాబాద్ జిల్లా, మోర్తాడు మండలం, గాండ్లపేట వద్ద గత వానాకాలంలో వరద కాలువకు గండిపడడంతో ఎస్సారెస్పీ నీటిని వరద కాలువలోకి

వదిలే అవకాశం లేకపోవడంతో వరద కాలువపై ఆధారపడి ఇరువైపులా పంటలు సాగుచేసిన రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిలోని అర టిఎంసిని నంది రిజర్వాయర్‌లోని బాహుబలి మోటార్ ద్వారా ఎత్తిపోసి అక్కడి రైతుల పంటలు కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ప్రధానమైన నంది రిజర్వాయర్ ద్వారా బాహుబలి మోటార్‌ను ఆన్‌చేసి 5వ సిస్టం ద్వారా నీటిని వదలడంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story