ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. ప్రైవేట్ పార్ట్‌ను కొరికిన విద్యార్థి

మన తెలంగాణ/కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్‌ను కొరికి గాయపరిచిన విద్యార్థి తిరిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కళాశాలలో 2025లో పీజీ పూర్తి చేసిన విద్యార్థి తన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కోసం కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరగా అతను తన ఇంటికి వస్తే టిసి ఇస్తానని తనతో శారీరకంగా కలవాలని కోరాడని విద్యార్థి వాపోయారు. దీంతో మంగళవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళారు. ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించగా విద్యార్థి.. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్‌ను కొరికేశాడు. దీంతో ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై విద్యార్థి స్నేహితుడు వీడియో తీయగా విద్యార్థి నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ప్రిన్సిపల్ ఇదే విద్యార్థిని రెండుసార్లు ఇంటికి పిలిచి వేధించినట్లు తెలిసింది. సంఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్‌పై పాలమూరు రిజిస్టర్ రమేష్ బాబు, ఓఎస్‌డి మధుసూదన్ రెడ్డి పిజి కళాశాలలో బుధవారం విచారణ జరిపారు. లైంగిక దాడికి గురైన రాము ఘటనపై విచారణ నిర్వహించారు. పీజీ కళాశాల స్టూడెంట్ రాముపై చదువుల కోసం టిసి కావాలని అడిగితే తన రూంకు రావాలని ప్రిన్సిపాల్ వేధింపులకు గురి చేశాడని దీంతో ప్రైవేట్ పార్ట్‌లు కొరికాడని, దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రిన్సిపాల్ పారిపోయాడని తెలిపారు.
రాముపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్‌ను తక్షణమే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పీజీ కళాశాల భవనానికి తాళం వేసి తరగతులను విద్యార్థులు బహిష్కరించారు. పాలమూరు రిజిస్టర్ రమేష్ బాబు, ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి పీజీ కళాశాలలో విచారణ నిర్వహించి పీజీ కళాశాలను మెన్స్ ఉమెన్స్ హాస్టల్ గదులను పరిశీలించారు.
పాలమూరు రిజిస్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘటన జరగడం బాధాకరమన్నారు. సంఘటనపై విచారణ నిర్వహిస్తున్నామని ఈ ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తామే బాధ్యత తీసుకొని పీజీ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు హామీ ఇచ్చారు. లైంగిక దాడికి గురైన ప్రిన్సిపాల్‌ను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
-
Home
-
Menu
