దానం నాగేందర్ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్..

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాకిచ్చింది. తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. ఈ నెల 18న తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దానం నాగేందర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేశారు. అదే రోజున సుప్రీం ధర్మాసనం కేసును 23న విచారణ చేపడతామని చెప్పడంతో న్యాయవాది రోహత్గి వెంటనే ‘స్టే’ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. మీరు ఎందుకంత తొందరపడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, ఏ క్షణమైనా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే ఆస్కారం ఉన్నందున ‘స్టే’ ఇవ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం బుధవారం విచారణ చేపడతామని చెప్పినప్పటికీ ఇతరత్రా కారణాల వల్ల గురువారానికి వాయిదా పడింది. ఇవాళ విచారించిన ధర్మాసనం.. దానం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఊడిపోవడం ఖాయంగా మారింది.
-
Home
-
Menu
