వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు

వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు
X

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పంటించారు. జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకుని దట్టమైన పొగ కమ్మేసింది. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ముట్టడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. ఆయన తండ్రి జోగి మోహనరావు, సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్ దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు.

టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై వైసీపీ నాయకుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా ఇటీవల కల్తీ మద్యం కేసులో అరెస్టయ్యి బెయిల్ పై విడుదలైన జోగి రమేష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు చిప్ దెబ్బతిందని, కల్తీ మాటలతో టీడీపీ కల్తీ అయ్యిందని అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు, లోకేష్ లపై జోగి రమేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ క్యాడర్ ఆయన ఇంటిపై దాడికి దిగినట్లు సమాచారం. దాడి సమాచారం తెలుసుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జోగి నివాసంలోకి వెళ్లగా టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

Tags

Next Story