ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం... బడివేళల బేఖాతర్

మండలంలో రోజురోజుకు నిర్వీర్యమవుతున్న విద్యావ్యవస్థ
విద్యావ్యవస్థను గాడినపెట్టేందుకు కరువైన ఉన్నతాధికారులు
పర్యవేక్షణ లోపంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా విధులకు హజరు
మన తెలంగాణ/పెద్దేముల్: ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం పాఠశాలలకు సకల సౌకర్యాలను కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి విశేషంగా కృషి చేస్తుంది. విద్యావ్యవస్థను బాగుచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను స్వయాన తనవద్దనే పెట్టుకున్నాడు. దీన్ని బట్టి విద్యావ్యవస్థపై ప్రభుత్వం, ముఖ్యమంత్రికి విద్యాశాఖపై పట్టింపును ఆర్థంచేసుకోవచ్చు. అయితే, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్షంతో ముఖ్యమంత్రి ఆశయాలకు.. ప్రభుత్వ ఆలోచన విధానాలకు తూట్లు పడుతున్నాయి.
వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలో ప్రభుత్వ ఆశయాలను, ముఖ్యమంత్రి ఆలోచనలను ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు తుంగలో తొక్కుతున్నారు. దీంతో పెద్దేముల్ మండలంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. గురువారం తట్టేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని బండమీదిపల్లి, రచ్చకట్ట తండా, జయరాం తాండా(టీ), ఓమ్లానాయక్ తండా, రాంసింగ్ తండా, పాషాపూర్, ఊరేంటి తండా, బాయిమీది తండా, అడ్కిచర్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మధ్యాహ్నం నుంచే ఒక్కొక్కటిగా మూసివేసి వెళ్ళిపోయారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, యూపీఎస్, ఉన్నత పాఠశాలలు 4.15వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఆయా పాఠశాలలను నిర్ణీత సమయానికంటే ముందే మూసివేయడం గమనార్హం. ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా విధులు నిర్వహించడం, పాఠశాలలను మూసివేయడం వలన విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుంది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపంతోనే విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుంది. మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు మండల విద్యావ్యవస్థను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో మండల వ్యాప్తంగా కొంతమంది ఉపాధ్యాయులు, అధికారులు “ఆడిందే ఆటా.. పాడిందే పాటగా” మారిపోయింది.
నిర్వీర్యమవుతున్న విద్యావ్యవస్థ
మండలంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుంది. కొన్ని సంఘాలకు చెందిన నాయకులు, ఒకరిద్దరి అధికారుల వలన విద్యావ్యవస్థ గాడితప్పింది. మండలంలో విద్యాశాఖను కొంతమంది బ్రష్టుపట్టిస్తున్నారు. మండల పరిధిలోని తట్టేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని గిరిజన తండాలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడంలేదు. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజన తండాలలో గిరిపుత్రువులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ఇదంతా అధికారుల పర్యవేక్షణ లోపంతోనే జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకపోతే కొంతమంది ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హజరును నమోదుచేసి వెళ్ళిపోయి.. మళ్ళీ సాయంత్రానికి పాఠశాలకు వచ్చి అటెండెన్స్ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌పై అధికారుల్లో పకడ్భందిగా పట్టింపులేకపోవడం గమనార్హం. ఏదేమైనా విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
పాఠశాలలు మూసేసి పరుగులు
మండల పరిధిలో సుమారుగా 10 పాఠశాలలను ఉపాధ్యాయులు పూర్తిగా మూసేసి వెళ్ళిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీరంతా ఆదే కాంప్లెక్స్ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళినట్లు సమాచారం. వాస్తవానికి సింగిల్ టీచర్లు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులకు జరిగే శిక్షణ నుంచే మినహయింపు ఉంటుంది. అలాంటిది, ఓ కార్యక్రమానికి ఉపాధ్యాయులంతా పాఠశాలలను మూసేసి వెళ్ళడం అనేది ఆందోళన కలిగిస్తోంది. ఇకపోతే, కొంతమంది ఉపాధ్యాయులు సర్వీస్ బుక్ అప్డేట్ కోసం వచ్చారని అధికారులు చెబుతున్నారు. అయితే, సర్వీస్ బుక్ కోసమే పాఠశాలలను మూసేసి రావాల్సిన అవసరం లేదు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు విడుతల వారిగా కాంప్లెక్స్‌కు వచ్చి సర్వీస్ బుక్‌ను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ, ఉపాధ్యాయులంతా ఏకంగా పాఠశాలలను మూసేసి పరుగులు తీయడం గమనార్హం.
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువయ్యింది. ఉపాధ్యాయులను అడిదే అధికారులు.. పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా విధులకు హజరవుతున్నారు. ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా? రావడం లేదా? పాఠశాలల్లో సరైనా విద్యాబోధన అందుతుందా? అనే అంశాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏకంగా తొమ్మిది పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తొమ్మిది పాఠశాలలు మూసివేసినకూడా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయంపై ఎంఈఓ నర్సింగ్ రావు వివరణ కోరగా పాఠశాలల మూసివేత తన దృష్టికి రాలేదని, ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన పూర్తిస్థాయి అధికారాలు కాంప్లెక్స్ హెచ్‌ఎం పరిధిలోనే ఉంటాయన్నారు. పాఠశాలలకు ఎలాంటి అధికారిక సెలవులైతే ఇవ్వలేదని, పాఠశాలల మూసివేత అంశం తనకు తెలియదని బదులిచ్చారు.
Tags
-
Home
-
Menu
