మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
X

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఎస్‌ఎస్‌సి) మంగళవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు.


సిబిఎస్‌ఇ తరహాలో పరీక్షల మధ్య వ్యవధి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ) విధానంలో ఈసారి పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఇచ్చారు. సిబిఎస్‌ఇ పరీక్షలలో ఒక్కో పరీక్షకు ఏడు రోజుల వ్యవధి కూడా ఇస్తారు. ఈసారి రాష్ట్రంలో స్టేట్ సిలబస్‌తో నిర్వహించే టెన్త్ పరీక్షలకు కూడా ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. పరీక్ష, పరీక్షకు మధ్య ఎక్కువ సమయం ఉంటే విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లభిస్తుందని అధికారులు భావించారు. గత ఏడాది టెన్త్ షెడ్యూల్‌లో పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి లేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారని అధికారులు గుర్తించారు.దాంతో ఈసారి సిబిఎస్‌ఇ తరహాలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఎస్‌ఎస్‌సి బోర్డు ఖరారు చేసింది. సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, బయాలజీ) సంబంధించి పరీక్ష విధానంలో ఎస్‌ఎస్‌సి బోర్డు స్పష్టత ఇచ్చింది. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు భాగాలుగా వేర్వేరు రోజుల్లో నాలుగు రోజుల వ్యవధితో జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్ పరీక్ష జరుగనుండగా, 7న బయాలజీ పరీక్ష జరుగనున్నది. బయాలజీ, సోషల్ స్టడీస్ పరీక్షలకు మధ్య ఎక్కువగా ఐదు రోజుల వ్యవధి ఉన్నది.

ఎక్కువ వ్యవధితో పరీక్షల నిర్వహణపై భిన్న వాదనలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సిబిఎస్‌ఇ తరహాలో పరీక్ష, పరీక్షకు మధ్య వ్యవధి నిర్ణయం పట్ల భిన్న వాదనలు వ్యక్తమవుతునాయి. పరీక్ష, పరీక్షల మధ్యలో ఒకటి, రెండు రోజుల వ్యవధి ఉంటే సరిపోతుందని, మరీ ఎక్కువ రోజులు అవసరం లేదన్నది కొందరు వాదిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల సమయంలో ఉంటే ఒత్తిడి లేకుండా చదువుకుంటారని అభిప్రాయపడుతున్నారు. సిబిఎస్‌ఇ బోర్డ్ ఒకేసారి పది, 12 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తుందని, దానికి తోడు ఆప్షనల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కో పరీక్ష మధ్య వ్యవధి ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. అదే తరహాలో మరీ ఎక్కువ రోజుల వ్యవధి సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయితే పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి కారణంగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఒక్కో సబ్జెక్టుపై ఎక్కువగా దృష్టి సారించడానికి, రివిజన్ చేసుకోవడానికి సమయం దొరుకుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని విద్యాశాఖ విశ్వసిస్తోంది.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

తేదీ పరీక్ష సమయం

2026 మార్చి 14 ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం 9.30- నుంచి 12.30

మార్చి 18 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30- నుంచి 12.30

మార్చి 23 ఇంగ్లీష్ ఉదయం 9.30- నుంచి 12.30

మార్చి 28 గణితం ఉదయం 9.30 నుంచి -12.30

ఏప్రిల్ 2 సైన్స్ పార్ట్ 1(ఫిజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి -11.00

ఏప్రిల్ 7 సైన్స్ పార్ట్ 2(బయాలజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి -11.00

ఏప్రిల్ 13 సోషల్ స్డడీస్ ఉదయం 9.30- నుంచి 12.30

ఏప్రిల్ 15 ఒకేషనల్ కోర్సు పేపర్ -1 భాషా పరీక్ష ఉదయం 9.30- నుంచి 11.30

ఏప్రిల్ 16 ఒకేషనల్ కోర్సు పేపర్- 2 భాషా పరీక్ష ఉదయం 9.30- నుంచి 11.30

...................................................................................

Tags

Next Story