పారాక్వాట్ పై వేటు

మన తెలంగాణ/హైదరాబాద్ :వ్యవసాయ భూముల్లో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల పారాక్వాట్ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు సంభవిస్తున్నాయి. క్షణికావేశంలో మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండ నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పారాక్వాట్ పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరంగా ఉందని ప్రకృతి వ్యసాయదారులు, వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన గడ్డిమందుగా గుర్తించి పారాక్వాట్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా పారాక్వాట్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్రానికి ఉన్న పరిమిత అధికారాలను ఉపయోగించి రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందును నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం జీఓ నెం. 24 జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులు బుదవారం నుంచి అమల్లోకి వస్తాయని, తదుపరి 60 రోజుల పాటు పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. పారాక్వాట్ గడ్డిమందు వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, కూరగాయల సాగులో కలుపు నియంత్రణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది అత్యంత విషపూరితమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ మందు పొలాల్లో పిచికారి చేసే సమయంలో చర్మంపై లేదా కళ్లలో పడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, క్షణికావేశం లేదా ప్రమాదవశాత్తు దీనిని తాగడం వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 1167 మరణాలు నమోదైనట్లు వైద్య విభాగం వెల్లడించిందన్నారు.
దీనికి సమర్థమైన విరుగుడు మందు లేకపోవడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమని వివరించారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా పారాక్వాట్ విక్రయాలను కూడా పూర్తిగా నిలిపివేయడానికి విజిలెన్స్, సైబర్ క్రైమ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఈ గడ్డిమందు అమ్మకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులందరూ పారాక్వాట్ గడ్డిమందుకు బదులుగా ప్రత్యామ్నాయ గడ్డిమందులను వినియోగించాలని మంత్రి తుమ్మల కోరారు.
చికిత్సకు లొంగని మందు
పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లిలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మార్పిడి చేసిన సంఘటన ఉంది. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సకు సంబందించి విరుగుడు ఫార్ములాను వాటి తయారీ కంపెనీలే ఇస్తుంటాయి. కానీ పారాక్వాట్ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు, చికిత్స లేక పేద మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగిసిన ఘటనలు కనిపిస్తున్నాయి. పారాక్వాట్ మనిషి శరీరంలోకి ప్రవేశించినపుడు జీర్ణకోశ, నాడీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసి, శరీర అవయవాలు క్రమంగా పనిచేయకుండా చేస్తుంది.
ఏమిటీ పారాక్వాట్?
పారాక్వాట్ డైక్లోరైడ్ గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమయినా కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును విరివిగా వినియోగిస్తున్నారు. అతి తక్కువ రూ.200 ఖర్చుతో సుమారు ఎకరం వ్యవసాయ భూమిలో కలుపు నివారణ చేయవచ్చు. మందు అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయి, పిచికారీ చేసే సమయంలోనూ రైతులు సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయి.
తయారు చేసే దేశంలోనే ఆంక్షలు
పారాక్వాట్ మందును సుమారు 70 దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్‌లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్రా జిల్లాలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంలో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60 రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపిసే అధికారం ఉండటంతో శాశ్వతంగా నివేదించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు అక్కడి ప్రభుత్వం లేఖ రాసింది.
-
Home
-
Menu
