కాంగ్రెస్ అసమర్థ పాలన తోనే విద్యుత్ సంక్షోభం

కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంతరెడ్డి అసమర్థ పాలన విధానాల వల్ల, చేతకాని తనం వల్ల రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి సంక్షోభం ఏర్పడిందని బిఆర్‌ఎస్ ఎంఎల్ె పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్యలు ఆరోపించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)ని మాజీ ఎంఎల్ఎలు ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంలో పోలీసులు అడ్డకోగా కేటీపీపీ ఎదుట బైఠాయించి మహాధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బిఆర్‌ఎస్ బృందాన్ని సొంత పూచీ కత్తుపై ప్లాంట్‌లోకి అనుమతించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణికి జెన్‌కో నుంచి రూ.52 వేల కోట్ల బకాయిలు ఉండటంతో బొగ్గు సరఫరా తగ్గిందని నేతలు ఆరోపించారు. కేటీపీపీకి రోజుకు 5 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 1,500 టన్నులు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి విద్యుత్ ప్లాంట్లలో యూనిట్లను నిలిపివేసి కృత్రిమ విద్యుత్ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టామని పల్లా పేర్కొన్నారు. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్నా ఎత్తిపోతల పథకాలను నడపడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లు నడిపి రైతులకు సాగునీరు అందించాలని, గతంలో నిర్మించిన ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహించాలని బిఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
-
Home
-
Menu
