తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం: రేవంత్

హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు సిఎం పరిశీలించారు. సదస్సులో ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయం అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నదని, జిడిపిలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయం అని పేర్కొన్నారు.
లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని, అందరి సహకారంతో తమ లక్ష్యాన్ని అందుకుంటామని సిఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం అని కొనియాడారు. అన్ని రంగాల నిపుణులు వచ్చినందుకు చాలా సంతోషం అని రేవంత్ అన్నారు. దేశజనాభాలో 2.9 శాతమే ఉన్నా.. 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజించామని చెప్పారు. 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని, క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని ప్రశంసించారు. తెలంగాణలో గ్వాంగ్ డాంగ్ నమూనా అమలు చేయదలచామని రేవంత్ స్పష్టం చేశారు.
-
Home
-
Menu
