200 కొత్త కోర్టులకు గ్రీన్‌సిగ్నల్

200 కొత్త కోర్టులకు గ్రీన్‌సిగ్నల్
X

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తూ, పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 200 నూతన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి- కమ్ -అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ విభాగం ఈ నెల24వ తేదీన న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవ్యస్థ మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు హైకోర్టు రాష్ట్రంలో జిల్లా జ్యుడీషియరీలో 594 నూతన కోర్టుల ఏర్పాటుకు సిబ్బంది, మౌలిక వసతులు, రికరింగ్, నాన్-రికరింగ్ బడ్జెట్‌తో సహా ప్రతిపాదనలు పంపింది.

దీనిపై స్పందించిన ప్రభుత్వం తొలి దశలో 200 కోర్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. జిల్లాల వారీగా, స్టేషన్ల వారీగా కోర్టుల సంఖ్యను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. రంగా రెడ్డి జిల్లాల్లో గరిష్ఠంగా 30 కోర్టులు (రాజేంద్రనగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, హయత్‌నగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నంలలో) కేటాయించింది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో 25 కోర్టులు (మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల్లో), హైదరాబాద్‌లో సిటీ సివిల్, సెషన్స్ కోర్టుల పరిధిలో 16 కోర్టులకు అనుమతించింది. నల్గొండలో 10, ఖమ్మంలో 8, సంగారెడ్డిలో 8, కరీంనగర్‌లో 7, సూర్యాపేటలో 7, నిజామాబాద్‌లో 6, జగిత్యాలలో 6, సిద్దిపేటలో5, మంచిర్యాల లో5, వరంగల్, హనుమకొండ కలిపి 12 కోర్టులు మంజూరయ్యాయి.

Tags

Next Story