హన్మకొండలో ఉద్రిక్తత

హన్మకొండలో ఉద్రిక్తత
X

సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రణరంగంగా హనుమకొండ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద హైడ్రామా

రాళ్లు, కర్రలతో కార్యకర్తల పరస్పర దాడులు, ఫ్లెక్సీల చింపివేత

లాఠీచార్జి.. ఇరువర్గాల నాయకుల అరెస్టు

మన తెలంగాణ/హనుమకొండ: సవాళ్లు, ప్రతిసవాళ్లతో హనుమకొండ రణరంగా మారింది. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ శ్రేణులు చౌరస్తాకు చేరితే.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వివరాల్లోకి వెళితే..హనుమకొండ నగరంలో ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జనచైతన్య సభ నిర్వహించారు.

ఈ సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్.. నాయిని రాజేందర్‌రెడ్డి 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను కూడా పోటీకి సిద్ధమని, ఎన్నికల్లో నాయినిని ఓడిస్తానని ప్రకటించి డెడ్‌లైన్ విధించడంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది.

దాస్యం విసిరిన సవాల్‌కు ప్రతిస్పందనగా కాంగ్రెస్ శ్రేణులు హనుమకొండ నడిచౌరస్తాకు చేరుకున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం నాయిని రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తమ నిరసనను కొనసాగించాయి. అయితే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయాలు సమీపంలోనే ఉండటంతో ఇరుపార్టీల కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు, ఫ్లెక్సీల చింపివేతతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

రాజకీయ రగడలో సామాన్యుల అవస్థలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో హనుమకొండ చౌరస్తా, బాలసముద్రం పరిసరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాళ్లు, కర్రల దాడుల తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags

Next Story