రెండు ఎటిఎంలలో భారీ చోరీ

రెండు ఎటిఎంలలో భారీ చోరీ
X

నిజామాబాద్ నగరం నిద్రపోతున్న వేళ...ఖాకీల గస్తీని వెక్కిరిస్తూ అంతర్‌ రాష్ట్ర ముఠా ఒక్కసారిగా పడగ విప్పింది. జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ముఠా రెప్పపాటు కాలంలో రెండు ఎటిఎం యంత్రాలను ధ్వంసం చేసి ఏకంగా రూ. 30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు చోట్ల దోపిడీ పూర్తి చేయడం పోలీసు యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటగా ఐదవ టౌన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌బిఐ ఎటిఎంలో చొరబడి గ్యాస్ కట్టర్లు, ఆధునిక పరికరాలతో క్షణాల్లో ధ్వంసం చేసి అందులోని నగదును కాజేశారు. అనంతరం గ్యాస్ ఫైర్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎటిఎం పూర్తిగా ధ్వంసమైంది. నాల్గవ టౌన్ పరిధిలోని పాంగ్రా బోర్గాంకు చెందిన డిసిబి బ్యాంకు ఎటిఎంలో చొరబడి మెషీన్‌ను ధ్వంసం చేసి నగదు అపహరించారు. ఈ రెండు ఎటిఎం లలో కలిసి సుమారు రూ.30 లక్షలను దోపిడీ దొంగలు అపహరించుకు పోయినట్టు తెలుస్తోంది.

ఈమేరకు నాలుగవ టౌన్‌లో ఐదవ టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెప్పపాటు కాలంలో ఎటిఎం యంత్రాలను ఛిద్రం చేయడం సాధారణ దొంగలకు సాధ్యం కాదని, ఈ యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన ఉన్న నిష్ణాతులైన నేరస్థులే ఈ పనికి పాల్పడి ఉంటారని పోలీసులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు అదనపు డిసిపి బస్వారెడ్డి, టౌన్ ఏసిపి రాజా వెంకట్‌రెడ్డి, సిఐలు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దీంతో నిజామాబాద్ ఇన్‌ఛార్జి కమిషనర్, కామారెడ్డి ఎస్‌పి రాజేష్ చంద్ర ఘటన స్థలాలకు చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించినట్లు తెలిపారు. సిసి కెమెరాల ద్వారా నమోదైన చిత్రాల ఆధారంగా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఘటన తీరుతెన్నులు రాజస్థాన్ మెవార్ ముఠాల పనితీరును పోలిఉన్నాయని అనుమానిస్తున్నారు. వెంటనే 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దారులన్నింటినీ జల్లెడపడుతున్నారు.

Tags

Next Story