రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య

రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...బోడుప్పల్, హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి(38), భర్త సురేందర్ రెడ్డి, కూతురు చేతన రెడ్డి(18) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది, కుమారుడు విశాల్ రెడ్డి(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విజయశాంతి రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త సురేందర్ రెడ్డి ఎపిలోని నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉండగా ముగ్గురు బోడుప్పల్‌లో ఉన్నారు. ముగ్గురు తెల్లవారుజామున ఎంఎంటిఎస్ డౌన్‌లైన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు మృతదేహాలు రైలు పట్టాలపై
పడి ఉండడం చూసిన గూడ్స్ రైలు లోకో పైలట్ జిఆర్‌పి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిఆర్‌పి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా, ఇంకా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయశాంతి నెలకు లక్ష రూపాయల వరకు జీతం వస్తుందని ఆర్థికంగా ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సురేందర్ రెడ్డిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.
-
Home
-
Menu
