ఆదివాసీ గూడాల్లో పులి సంచారం.. ఆవుపై దాడి

రాత్రి వేళ బయట అడుగు వేయడానికే భయంగా ఉంది అంటూ సాత్‌మెరి గ్రామస్తులు వణికిపోతున్నారు. పొలంలో ఉన్న మండపానికి కట్టిన ఆవుపై పులి దాడి చేయడంతో కలకలం రేగింది. ఆవు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొదట ఇది చిరుత దాడి అనుకున్నా రేంజ్ అధికారి నాగవత్ స్వామి నేతృత్వంలోని బృందం పరిశీలనలో అది పెద్ద పులి (టైగర్) దాడి అని నిర్ధారించారు. గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలు కనబడడంతో రాత్రివేళల్లో ఎవరూ బయటకు రావడం లేదు. పిల్లలు కూడా భయంతో ఇళ్లలోనే ఉన్నారు. పశువులను రైతులు ఇంటి ముందు కడుతున్నారు. అటవీశాఖ అధికారులు రెండు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలను గమనించేందుకు ప్రత్యేక బృందాలు కెమెరాలు ఏర్పాటు చేశాయి. గ్రామంలో భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఓ చంద్రారెడ్డి, బీట్ ఆఫీసర్లు సంతోష్, భీంజి, నాయక్, బేస్ క్యాంప్ సిబ్బంది జుగాందిరావ్, మారుతి, జంగు తదితరులు పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu
