యాదాద్రి భువనగిరిలో పులి సంచారం... అప్రమత్తంగా ఉండాలి

తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ లో ఆవుదూడపై దాడి…
రాజపేట మండలం బేగంపేటలో పెద్దపులి అడుగులు
భయాందోళనలో తుర్కపల్లి రాజపేట ప్రజానీకం
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: పచ్చని ప్రకృతి అందాలతో, ప్రశాంతంగా ఉండే పల్లెటూరి ప్రాంతం... పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో అలజడి రేగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఇబ్రహింపూర్, రాజపేట మండలంలోని బేగంపేట తదితర గ్రామాల్లో ఆదివారం పెద్దపులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు చుట్టు పక్కల గ్రామాల్లో పులి అడుగులను గుర్తించారు. రాజపేట మండలం బేగంపేటలో పులి అడుగులు ఉండగా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ లో ఆవుదూడ పై దాడి చేసిన పెద్దపులి పక్కనే అడవి తీరంలోని దట్టమైన ముళ్లపొదల్లో ఉన్నట్లు అటవీ సిబ్బంది అనుమానిస్తున్నారు. దీంతో పచ్చటి ప్రకృతి వనమైన పల్లెటూరి ప్రాంతమైన తుర్కపల్లి, రాజపేట, మండల సరిహద్దులో పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు, కూలీలు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మూడు రోజులుగా అలజడి రేపుతున్న పెద్దపులి ఇంతవరకు ఎక్కడా, ఎవరికీ కనిపించకపోవడం, పులి ద్వారా ఇప్పటివరకు మనుషులకు ఎటువంటి హాని లేకపోవడంతో ఇప్పటివరకు ఊరటగా అనిపిస్తోంది. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ తోపాటు రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం చేరవేస్తూ గ్రామాల్లో దండోరా వేయించారు. అటవీశాఖ అధికారులు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నిరంతరం పెద్దపులి కదలికలపై నిఘా వేసి ఉంచారు. మరోవైపు ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు ఫొటో మార్ఫింగ్‌లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నారు.
ఆవుదూడపై దాడి…
తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ లో చిరుత పులి ఓ ఆవుదూడ పై దాడి చేసింది. పక్కనే ఉన్న రాజాపేట మండలం బేగంపేటలో చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట, తుర్కపల్లి, మండల పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో చిరుత పులి సంచారంతో పంటపొలాలకు వెళ్లి పనిచేసుకునే రైతులు, రైతు కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్టు అధికారులు, స్థానిక గ్రామపంచాయతీల అధికారులు చిరుత పులి కదలికలపై గ్రామీణ ప్రజలను హెచ్చరిస్తూ డప్పు చాటింపు వేయించి అప్రమత్తం చేస్తున్నారు.
-
Home
-
Menu
